Jacqueline Fernandez | తనపై కేసును కొట్టేయండి..! ఢిల్లీ కోర్టు తలుపుతట్టిన బాలీవుడ్‌ బ్యూటీ..!

బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసు విషయంలో కేసును కొట్టివేయాలని కోరింది

  • Publish Date - December 19, 2023 / 04:56 AM IST

Jacqueline Fernandez | బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. రూ.200కోట్ల మనీలాండరింగ్‌ కేసు విషయంలో కేసును కొట్టివేయాలని కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అనుబంధ ఛార్జిషీట్లలో తనను నిందితురాలిగా పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పిటిషన్‌ను దాఖలుచేసింది. ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రాసిక్యూషన్‌ సాక్షిగా హాజరుపరిచినట్లు పిటిషన్‌లో నటి పేర్కొన్నది. ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ చేసిన నేరాల గురించి తనకు తెలియదని వాదించింది.


సుకేశ్‌చంద్రశేఖర్‌పై పలు దర్యాప్తు సంస్థలు 30కిపైగా కేసుల్లో అభియోగాలు మోపాయి. జైలులో ఉన్న తర్వాత వాయిస్‌ మాడ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి కాల్‌ స్పూఫింగ్‌ చేసి ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి రూ.215కోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపణలున్నాయి. జైలులో ఉంటూనే ప్రధానమంత్రి కార్యాలయం, ఆ తర్వాత న్యాయశాఖ, హోం మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిగా చెప్పుకుంటూ డబ్బులు దండుకున్నాడు. ఫోన్‌కాల్‌లో వ్యాపారి భార్యకు బెయిల్‌ ఇప్పిస్తానంటూ, ఫార్మాస్యూటికల్‌ వ్యాపారంలో సహకారం అందిస్తానని సుకేశ్‌ చంద్రశేఖర్‌ నమ్మబలికాడు. ప్రస్తుతం కేసులో అరెస్టయి ఢిల్లీ జైలులో ఉన్నాడు.


అయితే, సుకేశ్‌ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ దగ్గరగా ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాల్ వైరల్‌ అయ్యాయి. జాక్వెలిన్‌ డేటింగ్‌లో మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్‌ ఈడీ అధికారులకు విచారణ సమయంలో చెప్పాడు. ఈ క్రమంలోనే సుకేశ్‌ నుంచి జాక్వెలిన్‌ భారీగా కానుకలు అందుకున్నట్లు తేలింది. అయితే, మనీలాండరింగ్‌ వ్యవహారంలో తన ప్రమేయం లేదని శ్రీలంకన్‌ బ్యూటీ స్పష్టం చేసింది. సుకేశ్‌ తనను మోసం చేశాడని ఆరోపించింది.