BR Gavai | సుప్రీంకోర్ట్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి ఎంపికయ్యారు. ప్రస్తుత సీజేఐ సంజీవ్ ఖన్నా మే 13న రిటైర్ కానున్నారు. ఆయన స్థానంలో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ అయిన గవాయిని జస్టిస్ ఖన్నా సిఫారసు చేశారు. మే 14న సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్ గవాయి.. ఈ ఏడాది నవంబర్ 24 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన కీలక కేసులైన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లతో పాటు కంచ గచ్చిబౌలి భూముల కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారిస్తున్నది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఖన్నా మే 13న పద వీ విరమణ చేయనున్నారు. తదుపరి మే 14న జస్టిస్ గవాయ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త సీజేఐగా ప్రమాణం చేయించనున్నారు.
భూషణ్ రామకృష్ణ గవాయి 1960 నవంబర్ 24న మహారాష్ట్ర లోని అమరావతిలో జన్మించినట్టు భారత సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్ పేర్కొంటున్నది. 1985 మార్చి 16న బార్‌లో చేరారు. 1987 నుంచి 1990 వరకూ బాంబే హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ చేశారు. 1990 తర్వాత బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌లో ప్రాక్టీస్ చేశారు. రాజ్యాంగ చట్టం, పరిపాలనా చట్టంపై ఆయన ప్రధానంగా పనిచేశారు. 1992 ఆగస్ట్ నుంచి 1993 జూలై వరకూ బొంబాయిలోని నాగపూర్ బెంచ్‌లోని హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్‌లో ప్రభుత్వ సహాయ ప్లీడర్‌గా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 2000 సంవత్సరం జనవరిలో నాగపూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్‌గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003 నవంబర్ 14న హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్‌లో బాంబే హైకోర్టుకు పర్మినెంట్ జడ్జి అయ్యారు. మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.