విధాత: దేశానికి సేవలందించే లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందని.. రజతోత్సవం ఏ పార్టీకి అంటూ కాంగ్రెస్ నాయకులు అవాకులు చెవాకులు, పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుబోమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశఆరు. ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని కవిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. పరిణితి చెందడం ప్రకృతి ధర్మం.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూషన్ అని కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా, బీఆర్ఎస్ పార్టీనే అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటారు.. కానీ ఓట్లు బాగా రావాలని కోరునేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనుకుంటారని..ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజల విజయాన్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామన్నారు. కుంభమేళ తరహాలో రజతోత్సవ సభ జరగబోతుందన్నారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పిడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలుపెట్టారని, ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేసి..ఒక రక్తం చుక్క కూడా చిందించకుండా రాష్ట్రం సాధించిన ధీరుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉట్టిగనే రాలేదని..కేసీఆర్ మేధస్సు వల్ల వచ్చిందని..రాజకీయ కుట్రలను చేధించి తెలంగాణ వాదాన్ని ప్రజల్లో నిలబెట్టారన్నారు. తెలంగాణ కోసం 36 పార్టీల మద్ధతును కేసీఆర్ కూడగట్టారని గుర్తు చేశారు. తెలంగాణ నవయువకుల కోసం రజతోత్సవ సభ జరుగుతుందని కవిత చెప్పారు.
కాంగ్రెస్ చరిత్ర అంతా మోసపూరితమే
కాంగ్రెస్ పార్టీ నయవంచన చేయని వర్గమే లేదని..2004లో తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, 1400 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే పదేళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిందని కవిత విమర్శించారు. అలవికాని హామీలతో ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ 16 నెలల పాలనలో 16 పనులు కూడా కాలేదన్నారు. కాంగ్రెస్‌ది చేతగాని ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. మహిళలకు నెలకు రూ. 2,500, తులం బంగారం, స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతీ ఒక్కరు సభకు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.
మహిళా సాధికారతకు కేసీఆర్ బాటలు వేశారని.. మున్సిపాలిటీల్లో, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేసీఆర్ కల్పించారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల కోసం ప్రతీ జిల్లాలో హాస్టల్‌తో కూడి డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అందుకే మహిళలు భారీ ఎత్తున సభకు తరలిరావాలని పిలుపునిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చారన్నారు. రైతులు గుండెలపై చేయి వేసుకొని పడుకునే పరిస్థితిని కేసీఆర్ సృష్టించారని, కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి లక్షలాది ఎకరాలు ఎండిపోయేలా కాంగ్రెస్ పార్టీ చేసిందని మండిపడ్డారు. అందుకే రైతులంతా గులాబీ దండులా రజతోత్సవ సభకు కదలిరావాలని కోరుతున్నామని కవిత పేర్కొన్నారు.