Palla Rajeshwar Reddy : కార్యకర్తల ఆందోళనల మేరకే కవిత సస్పెన్షన్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా: కార్యకర్తల ఆందోళనలకే కవిత సస్పెన్షన్; కేసీఆర్ గట్టి సందేశం ఇచ్చారని తెలిపారు.

Palla Rajeshwar Reddy

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) నేతలు, కార్యకర్తల ఆందోళనల దృష్ట్యానే కవితను సస్పెండ్ చేసినట్లుగా ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(Palla Rajeshwar Reddy) వెల్లడించారు. కవిత సస్పెండ్ అంశంపై మీడియాతో పల్లా మాట్లాడారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడి పార్టీ సీనియర్ నేతలపై కవిత(Kavitha) కొంతకాలంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కవిత సస్పెండ్ తో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కన్న కూతురైనా, దగ్గరి బంధువైనా, ఇంకెవరైనా సమానమే అని కేసీఆర్(KCR) గట్టి సందేశం ఇచ్చారని పల్లా చెప్పుకొచ్చారు. కేసీఆర్ చాలా బాధతో కవిత సస్పెన్షన్(Kavitha Suspension) నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. 60లక్షల మంది సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ లో కవితకు ఎంత హక్కు ఉందో అందరికి అంతే హక్కు ఉందన్నారు.

పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారని కేసీఆర్‌ ఆదేశాలే మాకు శిరోధార్యం అన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఎవరిపై అయినా చర్యలు తప్పవని తెలిపారు. కాంగ్రెస్(Congress) పార్టీయే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు పెట్టిందని ఆరోపించారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్‌ కుట్ర ఉందన్నారు. దేశంలోని అనేక ప్రాంతీయ పార్టీల కుటుంబాలలో కాంగ్రెస్ చిచ్చుపెట్టిందని..అలాగే కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే రాజకీయాలకు పాల్పడిందన్నారు.