కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చే ప్రసక్తి లేదని కేసీఆర్ అన్నారు. ‘మేం ఎందుకు పడగొడుతాం రా బాయ్.. మాకేమన్న కాళ్లు చేతులు గులగుల పెట్టినయా.. మేం ఆ కిరికిరి పని చేయం. బిడ్డా మీరు ఉండాలే.. ఓట్లు తీసుకున్నారు. సక్కగ పని చేయకపోతే మీ వీపులు ప్రజలే సాప్ చేస్తరు’ అని హెచ్చరించారు. మీ సంగతేందో, మా సంగతేందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలన్నారు.
మీరందరూ ధైర్యంగా ఉండండి.. మళ్లా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం.. బ్రహ్మాండమైన పాలన అందించుకుందాం.. వీళ్లు చెడగొట్టేవి మంచిగా చేసుకుందాం. ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణను తయారు చేసుకుందాం.. ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు ఏడాదిన్నరలోనే కదిలి వచ్చిరంటే.. మీరు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు కనబడుతుంది. ఓట్లు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి. పుట్టిందే రాష్ట్ర సాధన కోసం. స్వార్థం కోసం మనం పని చేయలేదు. తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించే దాకా మనం పని చేస్తనే ఉండాలి. గవర్నమెంట్‌లో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలె. అదే మన కర్తవ్యం అని కేసీఆర్ సూచించారు.