విధాత : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల పేరుతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మరో భారీ వరంగల్ బహిరంగ సభకు సన్నద్ధమయ్యారు. అధికారం కోల్పోయాక ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాజకీయంగా బీఆర్ఎస్ బలనిరూపణ చేయాలని..తద్వారా భావిస్తున్న కేసీఆర్ జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతూ జనసమీకరణకు పిలుపునిస్తున్నారు. నిజానికి ఉద్యమ కాలంలో ఆయన పిలుపే ఓ ప్రభంజనమన్నట్లుగా జనం కేసీఆర్ సభలకు తరలొచ్చారు. అధికారంలో ఉండగా.. మందీ మార్బలం వెన్నుదన్నుగా సునాయాసంగా జనసమీకరణ చేసిన కేసీఆర్ ప్రస్తుతం జనసమీకరణకు పార్టీ నేతల వెంటబడుతున్నారు.
అయితే అధికారం కోల్పోయినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ భవన్ వేదికగా సమీక్షలు, తర్వాతా నియోజకవర్గాలలో మండలాల వారీగా సమీక్షలు.. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బస్సు యాత్రలతో పార్టీ నాయకులు వ్యయప్రయాసలు పడ్డారు. మధ్యలో నల్లగొండలో కృష్ణా జలాల సమస్యపైన, వరంగల్ లో బహిరంగ సభల పేరుతో ఆయా జిల్లాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నాయకులకు చేతి చమురు వదిలిపోయింది. అడపాదడపా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన ఆందోళనల ఖర్చు అదనం. అయితే.. ప్రస్తుత అవసరాల రీత్యా ఎంతఖర్చుకైనా వెనకాడొద్దని అధిష్ఠానం నుంచి సంకేతాలు వెళ్లినట్టు చెబుతున్నారు.
కమిటీలు లేవాయే.. పదవులు రావాయే
ఏదైన రాజకీయ పార్టీ మనుగడకు సైద్ధాంతిక పునాదితో పాటు సంస్థాగత నిర్మాణం కీలకం. బీఆర్ఎస్ పార్టీకి సైద్ధాంతికత అంటే తెలంగాణ ప్రయోజనాల జపంగానే చెబుతుంటారు. ఇక సంస్థాగత నిర్మాణాన్ని పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తు వచ్చారు. సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్న కాలంలో బీఆర్ఎస్ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతా రెండోసారి అధికారంలోకి వచ్చాకా సంస్థాగత పటిష్టతపై నిర్లక్ష్యం వహించారు. దీంతో కనీసం పార్టీ పదవులైనా లేకుండా ఎలా పనిచేస్తామన్న రీతిలో చాలమంది నాయకులు నామమాత్రంగా వ్యవహరించారు.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలే చూసుకుంటారు మాకెందుకు అన్నట్లుగా మండల, జిల్లా నాయకులు క్రీయశీలతకు దూరంగా ఉండిపోయారు. ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి పార్టీ ఓటమికి దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని ఆరెళ్ల క్రితం ప్రకటించగా..2022లో జిల్లా కమిటీలు ప్రకటించారు. ఆ తర్వాతా పూర్తి స్థాయి కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు ఊసు లేకుండా పోయింది. పైగా ఏ ఎమ్మెల్యేలనైతే ప్రజలు తిరస్కరించారో వారినే నియోజకవర్గ బాధ్యులుగా కొనసాగిస్తుండటం విడ్డూరం. ఇటీవల పార్టీ కమిటీల ఏర్పాటు బాధ్యతలను అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావుకు అప్పగించారు. ఇంత వరకూ ఆ నియామకాలు ఎక్కడిదాకా వచ్చాయో తెలియదు.
పార్టీని వదలని కుటుంబ ఆధిపత్యం
అసలు బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ కుటుంబ పార్టీ అన్నట్లుగా తయారైందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత తప్ప ఇంటా బయటా చివరకు అసెంబ్లీ, మండలిలో సైతం అధికారం ఉన్నప్పుడు వారే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ వారే అన్నట్లుగా పార్టీని నడిపిస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా తామంతా ఉరుకులాడటమేందుకన్న స్తబ్దత పార్టీ ముఖ్య నాయకుల్లో ఆవరించిందనే అభిప్రాయాలు ఉన్నాయి. చివరకు ముఖ్యమైన మీడియా సమావేశాలు సైతం వారు పెట్టాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో కేడర్ బేస్ గా పార్టీని బలోపేతం చేస్తామంటూ ప్రకటించడం మాటలకే పరిమితమైంది. పార్లమెంటు ఎన్నికల్లో సున్నాకే పరిమితమైనప్పటికి సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు వరంగల్ సభకు జనసమీకరణ కోసం సభ ముగిశాక పార్టీ సంస్థాగత నిర్మాణం చేస్తామంటూ కేడర్ కు ఆశలు రేపుతున్నారు. అదీగాక మరోసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తామంటూ ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఫంక్తు రాజకీయ పార్టీ అని చెప్పిన కేసీఆర్ రాజకీయ బలోపేతం పేరుతో ఉద్యమకాలమంతా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల పదవులు మొదలుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ పదవుల వరకు వలస నాయకులకు, వ్యాపార వేత్తలకే పెద్ధపీట వేశారు. దీంతో ఉద్యమకారుల్లో నెలకొన్న అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి ఓ ముఖ్యకారకమైంది. అయినా అధికారం కోల్పోయాకైనా ఆత్మవిమర్శ..అంతర్మధనంతో పార్టీ ప్రక్షాళన.. పునర్నిర్మాణం చేస్తారని పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
టీఆర్ఎస్ కే రజతోత్సవం!
పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుండగా.. ఉద్యమ పార్టీగా పద్నాలుగేళ్లు.. అధికార పార్టీగా పదేళ్లు పరిపాలించి.. ప్రతిపక్ష పార్టీగా ఏడాది ముగించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలకు సిద్ధమైంది. వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సం పేరుతో నిర్వహిస్తున్న సభ వాస్తవానికి టీఆర్ఎస్ రజతోత్సవ సభగానే చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన ఎకైక అజెండాగా కేసీఆర్ 2001ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఈ లెక్కన ఆ పార్టీకి ఈ ఏప్రిల్ 27తో 25ఏళ్లు పూర్తవ్వనున్నాయి. ఇకపోతే 2024 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుండి భారత రాష్ట్ర సమితిగా అక్టోబర్ 5, 2022న పేరు మార్చారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించి తాను దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానంటూ..ఫెడరల్ ఫ్రంట్ నినాదం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర శాఖలను ప్రారంభించారు. ఆనంతరం స్వరాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోయారు.
88 మంది ఎమ్మెల్యేల సంఖ్య నుండి పార్టీ బలం 39కి పడిపోయింది. అవమానం భారంతో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి సైతం ముఖం చాటేశారు. ఆ తర్వాతా పార్లమెంటు ఎన్నికల్లోనూ స్వయంగా బస్సు యాత్ర చేసినా ఒక్క సీటు గెలవలేక సున్నాతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో వారి 9 సిట్టింగ్ సీట్లనూ కోల్పోయారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల్లో 10మంది పార్టీ కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. జిల్లా, మండల, పంచాయతీ, పురపాలికల ప్రజాప్రతినిధుల్లో మెజార్టీ పార్టీ మారారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ నుంచి పాలన నడిపించినట్లుగా ప్రతిపక్ష పార్టీ నేతగా ఏడాదిన్నర నుంచి మళ్లీ ఫామ్ హౌస్, తెలంగాణ భవన్ నుంచి పార్టీని నడిపిస్తున్నారు. పదేళ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పును నేటీకి జీర్ణించుకోలేక పోతున్న కేసీఆర్ కుటుంబం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకత నెలకొందని మళ్లీ మనమే వస్తామంటూ కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అదే మాటలు వరంగల్ బహిరంగ సభ వేదిక నుంచి కొత్తగా వల్లె వేస్తారా? లేక పూర్తిస్థాయిలో పార్టీ ప్రక్షాళనకు, పునర్నిర్మాణానికి నాంది పలుకుతారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.