Site icon vidhaatha

Formula e Car Race | ఫార్ములా ఈ కారు రేస్‌తో తెలంగాణ ప్రతిష్ఠ పెంచా : కేటీఆర్‌

Formula e Car Race | ఫార్ములా ఈ కారు రేసుతో తెలంగాణ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయే పని చేశానే కాని.. తాను ఎలాంటి తప్పుగాని, తలదించుకునే పనిగాని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు స్పష్టం చేశారు. సోమవారం ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ వద్ధ మీడియాతో మాట్లాడారు. నాలుగు గోడల మధ్య కాదు.. నాలుగు కోట్ల మంది ముందు ఫార్ములా ఈ రేసు గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే సీఎం రేవంత్ రెడ్డి పారిపోయాడని విమర్శించారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు సాహసించని లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని తానంటే రావడానికి రేవంత్ రెడ్డికి ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. మొదటి సంవత్సరం ఫార్ములా రేసు విజయవంతం కావడంతో రెండవ సంవత్సరం కూడా ఎలాగైనా హైదరాబాద్ లోనే నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని అందులో భాగంగానే, నిర్వహణ సంస్థ బ్యాంకు ఖాతాకు డబ్బులు పంపించిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించానని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని తాను అధికారులను ప్రశ్నిస్తే వారి దగ్గరి నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.

ఈ కారు రేస్ కేసు..తుపేల్ కేసు

అసలు కరప్షనే జరగని ఓ తుపేల్ కేసులో ఏసీబీని ఇన్వాల్వ్ చేయడాన్ని తన 26 సంవత్సరాల కెరీర్ లో చూడనే లేదని మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. చిట్టినాయుడు(రేవంత్ రెడ్డి) రాసిచ్చిన పనికిమాలిన ప్రశ్నలనే పొద్దుటి నుంచి అటుతిప్పి ఇటు తిప్పి ఏసీబీ అధికారులు అడిగారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వ పెద్దల నుంచి నన్ను అరెస్ట్ చెయ్యాలని ఒత్తిడి ఉంటే బేషుగ్గా చేసుకోవచ్చని అధికారులకు చెప్పానని కేటీఆర్ వెల్లడించారు. అవసరమైతే తెలంగాణ కోసం మరోసారి జైలుకు వెళ్లడానికి కూడా సిద్దమన్నారు. రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ బీఆర్ఎస్ లో లేరన్నారు.  50 లక్షల డబ్బుల బ్యాగుతో లుచ్చా పని చేసి అడ్డంగా దొరికి నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి..తమను కూడా ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలన్న శాడిస్ట్ ఆలోచనతో ఉన్నాడని కేటీఆర్ ఆరోపించారు. అందులో భాగంగానే తెలంగాణ సాధించిన కేసీఆర్ ను, మాజీ మంత్రి హరీశ్ రావును కాళేశ్వరం కమిషన్ ముందుకు, తనను ఏసీబీ విచారణకు పిలుస్తున్నాడని విమర్శించారు. అయితే ఇవన్నీ లొట్టపీసు కేసులని..రేవంత్ రెడ్డి ఓ లొట్ట పీస్ ముఖ్యమంత్రి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదని విమర్శించారు. దద్దమ్మ రాజకీయాలతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. అక్రమ కేసుల్లో తమకు నోటీసులు రావడం పాత చింతకాయ పచ్చడిలా మారిందని..బీఆర్ఎస్ కేడర్ వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పెడితే ఒక 15 రోజులు తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచికానందం పొందడం తప్ప ఇంకేం చేయలేడని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా జై తెలంగాణ అనకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే, తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని అంటుంటే..ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నారంటుంటే.. బరాబర్ రేవంత్ రెడ్డిని హౌలా అనే అంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. 2019 జూన్ 21 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కాళేశ్వరం గొప్పదనాన్ని ప్రజలకు తెలియచేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిగీసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఫుట్బాల్ ఆడి చిత్తుచిత్తుగా ఓడించడం మీద బీఆర్ఎస్ నాయకులు దృష్టి పెట్టాలని కేటీఆర్ తెలిపారు.

18నెలల పాలనలో కేటీఆర్ పై 14కేసులు : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ పై 14 కేసులు పెట్టాడని తెలిపారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. మాట తప్పినందుకు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాలని విమర్శించారు. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిన నిన్ను ఏం చేయాలి రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు. కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచే విధంగా, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఈ ఫార్ములా రేసింగ్ కోసం పోటీపడుతుంటే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఫార్ములా ఈ రేసును తీసుకువచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించమని తేల్చి చెబితే తెలంగాణలో నిర్వహించి ఈ దేశ పరువు, రాష్ట్ర పరువు తీశాడని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కమీషన్లను ఎత్తిచూపితే కేసులు, లఘుచర్ల రైతులకు బేడీలేస్తే కేసులు, ప్రశ్నిస్తే కేసులని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని..లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల అండ ఉన్న కేటీఆర్ ని ముట్టుకుంటే భస్మం అయిపోతారు తస్మాత్ జాగ్రత్త అని హరీష్ రావు హెచ్చరించారు.

Exit mobile version