Site icon vidhaatha

CM Revanth Reddy | నల్లమల పవర్ దేశానికి చూపిస్తా

– తెలంగాణను ఆదర్శంగా పరిపాలిస్తా
– ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
– గిరిజనులకు రూ.12,600 కోట్లతో పనులు
– ఇందిర సౌర గిరి జల వికాసం రోల్ మోడల్
– మాచారంలో గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | విధాత, మహబూబ్ నగర్ : నల్లమల బిడ్డగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పరిపాలిస్తానని.. నల్లమల పవర్, పౌరుషం ఏంటో ఈ దేశానికి చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే స్ప్రింక్లర్, డ్రిప్‌ను స్విచ్ ఆన్ చేశారు. ఈ పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజనుల సమగ్రాభివృద్ధికి రూపొందించిన 10 అంశాలతో నల్లమల డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి , మంత్రులు ఆవిష్కరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలకు రూ.119 కోట్ల రుణాలు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఈ పథకం పైలట్ ప్రాజెక్టుతో అచ్చంపేట నియోజవకవర్గం సోలార్ విద్యుత్తు వినియోగంలో దేశానికే ఒక మోడల్‌గా, గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపబోతుందన్నారు. పాలమూరు, నల్లమల ప్రాంత వాసినని తాను గర్వంగా చెప్పుకుంటానని.. పాలమూరు బిడ్డలు కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు దేశానికి వెన్నముకగా నిలిచాయన్నారు. నల్లమల (Nallamala) అంటే ఒకప్పుడు వెనకబడిన ప్రాంతమని, ఎవరో వచ్చి నల్లమలను అభివృద్ధి చేయాలని అనేవారే కానీ అభివృద్ధి చేయలేదని చెప్పారు. ఇప్పుడు నల్లమల బిడ్డ పరిపాలకుడిగా ఉన్నాడని.. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతోందన్నారు. నల్లమల డిక్లరేషన్‌ ద్వారా గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు.

రైతుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు

పోడు రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. గిరిజనుల కోసం ప్రత్యేక పథకాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని గుర్తు చేశారు. ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకంతో అచ్చంపేటలో ప్రతి రైతుకూ సోలార్‌ విద్యుత్‌ అందించి తీరుతామని స్పష్టం చేశారు. సోలార్‌ విద్యుత్‌తో ఆదాయం వచ్చేలా చేస్తామని తెలిపారు. తెలంగాణలో కోటి 35 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి సాధించామని.. సన్నబియ్యం పండించమని చెబితే తనను సన్నాసి అన్నారని..ఈ రోజు ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం ఇస్తున్నామని…స‌న్న‌బియ్యం పండిస్తే రూ.500బోన‌స్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.ఇప్పటి వరకు రైతుల కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. కడుపు నిండా విషం పెట్టుకున్న వాళ్ల గురించి..సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వారి గురించి నేను పట్టించుకోనన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టామని, మహిళా సంఘాలను పెట్రోల్‌ బంక్‌లకు యజమానులను చేశామని అన్నారు. హైటెక్‌ సిటీలో తమ ఉత్పత్తులు అమ్ముకునేలా 3 ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. మహిళలే ఆర్టీసీ బస్‌లు అద్దెకు తిప్పుకునేలా చేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

దేశంలో తెలంగాణ నంబర్ వన్..

బీఆర్ఎస్ (brs) హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ధర్నాలు చేశారని.. ఇప్పుడు త్వరగా నోటిఫికేషన్‌లు ఇవ్వవద్దని నిరుద్యోగులు కోరుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిత్యావసర సరకుల ధరలు పెరగకుండా నియంత్రించడంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని.. శాంతి భద్రతల విషయంలో దేశంలో మన రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని.. నిరుద్యోగ సమస్య పరిష్కారంలో దేశంలో నంబర్ వన్ గా ఉందని.. పాలమూరు బిడ్డలకు పరిపాలన చేతకాదని అన్న వారికి.. మనం నంబర్ వన్‌లో ఉండి గట్టి సమాధానం చెప్పామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయినా ఇది సరిపోదని..ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చిందని..54 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌తో యుద్ధం చేసి.. ఆ దేశాన్ని రెండు ముక్కలు చేసిన ఘనత ఇందిరమ్మదన్నారు. ఇప్పటికీ ప్రతీ ఇంటిలో ఇందిరమ్మ అంటే అభిమానం ఉందని.అందుకే ఇందిరమ్మ పేరుతోనే ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం తెచ్చామని గుర్తు చేశారు. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్‌ పార్టీ అని.. అందరికీ భూములు ఇచ్చి ఆత్మగౌరవం నింపాలన్నది మా పార్టీ నినాదం. ప్రతి ఆదివాసీ గుండెల్లో ఇందిరమ్మ ఉంటుంది అని రేవంత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణరావు, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీలు మల్లు రవి, పొరికె బలరాం, ఎమ్మెల్యే వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.

 

 

Exit mobile version