విధాత: బడ్జెట్‌లో తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేసింది. ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణను పట్టించుకోలేదని అంటున్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా నిధులు మినహా అదనంగా బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమి లేదని అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే పెట్టిన పద్దుగా తెలంగాణ వాదులు అభివర్ణిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిప్యూటీ సీెం భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులతో సమావేశమయ్యారు. బీజేపీ పార్టీకి తెలంగాణపై పెత్తనం కావాలి, తెలంగాణ నుంచి సీట్లు కావాలి కానీ, తెలంగాణ పదం కూడా బడ్జెట్‌లో పెట్టలేదన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంపై పార్టీలకు అతీతంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ప్రాంతీయ పార్టీలకు ఎంపీలుంటేనే న్యాయం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అన్యాయం జరిగిందని, ఇది చాలా దురదృష్టకరమని బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ బీహార్ బడ్జెట్ గా మారిందని ఆరోపించారు. నవోదయ,సైనిక్ స్కూళ్లు, ఐఐఎం, ట్రిపుల్ ఐటి లాంటి విద్యాలయాల ప్రకటన గానీ తెలంగాణకు ఉపయోగపడే మరే అంశం గానీ బడ్జెట్ లో లేదన్నారు. ఇచ్చేవాళ్ళు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నా నిధులు సాధించింది సున్నా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులుతీసుకు రావడం కోసం కొట్లాడాల్సిన కాంగ్రెస్ వాళ్ళు 8 ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యమన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని, దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.