విధాత: మాజీ మంత్రి, సీడబ్ల్యుసీ సభ్యులు రఘువీరారెడ్డి తనదైన రాజకీయ, వ్యక్తిగత జీవన వ్యవహారాలతో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్ర విభజన పిదప ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జీరోకు పడిపోవడంతో రాజకీయాల నుంచి తప్పుకుని స్వగ్రామంలో వ్యవసాయానికి పరిమితమై నిరాడంబర జీవితం సాగించారు. తిరిగి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చి ఏపీ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. తరుచు సాధారణ ప్రయాణికుల మాదిరిగా ప్రభుత్వ రవాణ సంస్థల బస్సుల్లో ప్రయాణిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
తాజాగా ఆయన మేఘాలయాలోని చిరపుంజిలో పర్యటిస్తున్నారు. రంగుల టీ షర్ట్, నల్ల కళ్లద్దాలు, నల్ల ప్యాంటు..వీపుకు బ్యాగ్ ధరించి వింటేజ్ లుక్ లో దర్శనమిచ్చారు. ఎప్పుడు తెల్లని ఖద్దర్ వస్త్రాలు ధరించే రఘువీరారెడ్డి వింటేజ్ లుక్ లో టూరిస్టు మాదిరిగా కనిపించడం అందరిని అశ్చర్యపరిచింది. తన చిరపుంజి పర్యటనలోనూ ఆయన తన కరువు నేల మాతృభూమి రాయలసీమ గురించి మాట్లాడి ఆకట్టుకున్నారు.
కరువు నేల అనంతపురంలో పుట్టిన నాకు 365 రోజులూ వర్షాలు కురిసే చిరపుంజిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇలాగే అన్ని కరవు ప్రాంతాలలో మంచి వర్షాలు పడాలని భగవంతుడిని కోరుకుంటున్నానని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. మొత్తం మీద రఘువీరారెడ్డి ఎక్కడ పర్యటించినా..ఏ హోదాలో ఉన్న తన సొంత ప్రాంతం అభివృద్ధికి కాంక్షించి సీమ పట్ల తన నిబద్ధతను, ఆపేక్షను చాటుకున్నారని అభిమానులు సంబరపడుతున్నారు.