- అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్
- మళ్లీ వచ్చేది బీఆరెస్ ప్రభుత్వమే
- పదేళ్లలో ప్రగతి పథాన నడిపిస్తే..
- కాంగ్రెసోళ్లు సర్వనాశనం చేశారు
- అబద్ధాల్లో వాళ్లను మించినోళ్లు లేరు
- ఇచ్చిన హామీల అమలు ఎక్కడ?
- ఓట్లు వేయించుకుని.. ఆగం పట్టించారు
- నాడు నంబర్ 1.. నేడు 15వ స్థానంలోకి
- తెలంగాణను చూస్తుంటే బాధేస్తున్నది
- ఏడాదిలోనే ఇంత గల్లంతు అయితదా?
- మేం బుల్డోజర్లతో పూడికలు తీశాం
- వాళ్లు.. పేదల ఇండ్లను కూల్చుతున్నారు
- ఇవన్నీ చూసి మౌనంగా ఉందామా..?
- బీఆరెస్ రజతోత్సవ సభలో కే చంద్రశేఖర్‌రావు
వరంగల్, (విధాత): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘపోరాటం అనంతరం, ఆఖరుకు తాను చావు నోట్లో తల పెట్టి మరీ తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. పదేళ్లలో అన్ని రంగాల్లో ప్రగతి పథాన నడిపిస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనమైందని మండిపడ్డారు. ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. బీఆరెస్ రజతోత్సవ సభను ఆదివారం వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నిర్వహించారు. లక్షల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరైన ఈ సభనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్న తీరుతెన్నులను, అనంతరం బీఆరెస్ ప్రభుత్వంలో పదేళ్ల అభివృద్ధిని ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రజలు దీవిస్తే అద్భుతమైన పదేండ్ల పాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసి, అందరూ ఆశ్చర్యపోయే విధంగా నిర్మాణం చేసుకున్నామన్నారు.
కాంగ్రెస్‌కు ఏం బీమారి?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న కేసీఆర్.. ‘ఏ మాయం రోగం వచ్చే.. ఏం బీమారి వచ్చే.. ఏమేమి చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి, ఏమేమి మాటలు మాట్లాడిండ్రు. వరుసబట్టి గోల్ మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేరు’ అంటూ కేసీఆర్ అన్నారు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీకెల్లిదిగారని, స్టేజీల మీద డ్యాన్స్‌లు చేశారని సెటైర్లు వేశారు.
హామీ అమలు ఎక్కడ?
‘కేసీఆర్ రైతు బంధు కింద ఏం ఇస్తుండు.. పదివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్లు 2 వేలు ఇస్తుండు మేం 4 వేలు ఇస్తామని చెప్పిండ్రు. ఇద్దరు ఉంటే ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరికీ ఇస్తమని చెప్పిండ్రు.. దివ్యాంగులకు కేసీఆర్ 4 వేలు ఇస్తుండు మేం 6 వేలు ఇస్తమండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. విద్యార్థులకు విద్యాకార్డు కింద ఐదు లక్ష్యల గ్యారెంటీ కార్డు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పిండ్రు. 2 లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ 9న ఒక కలంపోటుతో ఖతం చేస్తా అన్నారు. చేసిండ్రా అంటే చేయలేదు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడన్న వస్తుందా? అని కేసీఆర్ విమర్శించారు.
ప్రజలను దగా చేశారు
‘ఆరు చందమామలు.. ఏడు సూర్యుళ్లు పెడుతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు. ఈ మాట వాస్తవం. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు’ అని కేసీఆర్ అన్నారు. ఇంత మోసం ఉంటదా? తెలంగాణను ఇప్పుడు బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం’ అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్థిక పరిస్థితిని నాశనం పట్టించారు
అవివేకం, అజ్ఞానం వల్ల పరిపాలన చేయడం రాక ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేశారని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే.. కష్టపడి నోరు కట్టుకుని ఏడాదికి 15 వేల కోట్ల ఆదాయం పెంచాం. తెలంగాణను ఎట్ల తయారు చేశాం. తెలంగాణ నా కళ్ల ముందు ఇలా కావడం నాకు దుఃఖం కలిగిస్తుంది’ అని చెప్పారు. ‘భూముల ధరలు ఎక్కడికి పోయాయి? రైతులు కోటీశ్వరులమనే ధైర్యంతో ఉండే. ఒక్క ఏడాదిలోనే ఇంత గల్లంతు అయితదా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమైతదా?’ అని ఆవేదన చెందారు.
తాను సీఎం అయ్యాక 24 గంటలూ కరెంటు ఇచ్చామన్న కేసీఆర్.. కరెంట్ ఇవ్వడం చేత కావడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఏం దౌర్భాగ్యం ఇది? ఎటువంటి శని మనం నెత్తి మీద పెట్టుకున్నాం? మేం కృష్ణా, గోదావరి నీళ్లు మీ ఇంటి ముందర దుంకించినం.. ఇప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వడం చేతనైత లేదు. కరెంట్ పోతది.. మంచినీళ్లు రావు.. వడ్లు కొనే దిక్కు లేదు. దళారీ, దోపిడీ వ్యవస్థకు రైతాంగం గురవుతుంది. 2104కు ముందు పరిస్థితిలు వస్తున్నాయి.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా..?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
పేదల ఇళ్లపైకి బుల్డోజర్లా?
తాము వరంగల్, హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షలాది మందికి పట్టాలిచ్చామని కేసీఆర్ చెప్పారు. తాము బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడికలు తీస్తే వీళ్లెమో హైడ్రా అని, వాని బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూలగొడుతున్నరు. ఆనాడు చెరువుల పూడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ పేదల ఇండ్లు కూలగొడుతున్నాయి’ అని మండిపడ్డారు. ఇవన్నీ చూసి మౌనంగా ఉందామా..? కొట్లాడుదామా..? ఏం చేద్దామనే ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని కేసీఆర్ చెప్పారు.
నాడు నంబర్ 1.. నేడు 15వ స్థానంలోకి
దేశంలోనే రాష్ట్రాన్ని ఆనాడు తాము నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ 15వ స్థానానికి కాంగ్రెసోళ్లు తీసుకుపోయారని కేసీఆర్ విమర్శించారు. తన కళ్ల ముందే ఇంత మోసం చేస్తారని అనుకోలేదన్నారు. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కి పోతున్నదని చెప్పారు. దీనికి కారణం కాంగ్రెస్ దుర్మార్గులదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పువ్వు పుట్టంగానే పరిమళిస్తది అన్నట్టు ప్రభుత్వం కథ తెల్వదా.. వీళ్లకు టైం ఎక్కడిది.. ఇక ఉన్నది రెండున్నరేండ్లు.. అందుకోసం ప్రజానీకం ఆలోచన చేయాలి. దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. ఆవేశంతో కాకుండా మేధావితనంతో పని చేయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. పొగొట్టుకున్నచోటే వెతకాలి.. ఎక్కడ జారిపోయిందో అక్కడే పట్టుకోవాలి.. ఆ నైపుణ్యం రావాలి’ అని కేసీఆర్ అన్నారు.
అన్ని రంగాల్లో ఫెయిల్
రాజ్యం నడప చేతగాక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ దుమ్మెత్తారు. అన్ని రంగాల్లో ఫెయిలయ్యారని విమర్శించారు. తాము 90%. 80% పూర్తి చేసిన ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలు బంద్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రిగా పని చేసేటోళ్లకు గాంభీర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ తీసుకొచ్చిండు. నేను సీఎం అయ్యాక దాన్ని కొనసాగించాలని చెప్పాను. ఇది మా స్కీం కాదు.. కాంగ్రెస్ స్కీం అని చెప్పి కొనసాగించాను. కానీ వీళ్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు.