Deputy CM Batti | 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చరిత్రలో లిఖించదగిన అంశం : డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో కలిసి ఏర్పాటు చేసిన 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో మాట్లాడారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధన సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ కల అని.. ఆ కల సాధనకు ప్రతి ఒక్కరం ఆలోచిస్తున్నాం అడుగులు వేస్తున్నాం అని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించారని డిప్యూటీ సీఎం వివరించారు.

2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ISB తో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే వివిధ శాఖల నుంచి నోడల్ ఆఫీసర్లను నియమించి, వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ISB బృందం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసిందని తెలిపారు. వచ్చే నెల 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ జరగనుందని.. తక్కువ సమయం అందుబాటులో ఉన్నందున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి విజన్ డాక్యుమెంట్ ను తుది దశకు తీసుకురావాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన అనేది చరిత్రలో లిఖించదగిన అంశమని భట్టి వివరించారు.

ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, వాటి అమలు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశామని భట్టి తెలిపారు. డిసెంబరు 9తో ప్రజా ప్రభుత్వం రెండవ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు సంవత్సరాల్లో ఏం చేశామని చెప్పడం కంటే కూడా, భవిష్యత్ తరాలకు మేలు చేకూరేలా ఏ విధమైన పునాదులు వేయబోతున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం అనే విషయాలను ప్రపంచానికి డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు భట్టి తెలిపారు.

ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సంజయ్ కుమార్, వికాస్ రాజ్, ఉన్నతాధికారులు శ్రీధర్, మహేష్ దత్ ఎక్కా, సందీప్ కుమార్ సుల్తానియా, నవీన్ మిట్టల్, హరీష్, బుద్ధ ప్రకాష్, కృష్ణ భాస్కర్, ముషారఫ్ అలీ, నాగిరెడ్డి, చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

Latest News