విధాత: పాడుతా తీయగా షో గతంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పటిలా ఇప్పుడు లేదని ప్రవస్తి పేర్కొంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రచయిత చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం పాడుతా తీయగా (Padutha Theeyaga) కార్యక్రమం ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సైతం జరుపుకుంటోంది. ఈ కార్యక్రమంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని రంటూ న్యాయ నిర్ణేతలపై సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపణలు చేశారు. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇస్తున్నారని, తాను వెడ్డింగ్ షోలలో పాటలు పాడిన అంశాన్ని పేర్కొంటూ తనను ఘోరంగా అవమానించారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించింది.
సెట్ లో తనను బాడీ షేమింగ్ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను షూటింగ్ లో ఓ చీడపురుగులా చూశారని వాపోయింది. తమిళ పరిశ్రమలో ఎన్నో పాటలు పాడానని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదన్న సింగర్ ప్రవస్తి ఆరాధ్య తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసింది. పాడుతా తీయగా నుంచి తనను ఎలివేట్ చేసినందుకు తాను వారిపై ఆరోపణలు చేయడం లేదని.. తనకు ఎదురైన అనుభవాలనే వెల్లడిస్తున్నానని తెలిపింది.
ఇక పాడుతా తీయగా ప్రొడక్షన్ విషయానికి వస్తే అది చాలా వరస్ట్ అని మాకు కాస్ట్యుమ్స్ ఇచ్చి నడుము కిందికి కట్టుకోమంటారని, ఎక్స్ ఫోజింగ్ చేయమంటారని తెలిపింది. అలా ఎందుకని అడిగితే నీకున్న బాడీకి ఇంకేమి ఇవ్వగలను అంటూ కాస్ట్యూమ్ డిజైనర్ అసభ్యంగా మాట్లాడాడని, వీళ్ళ మాటలు, చేతలతో నాలోని కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయిందని ఓ దశలో డిప్రెషన్‌కి సైతం వెళ్లాననిచెప్పెకొచ్చింది. ముఖ్యంగా జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం వరస్ట్‌గా తయారైందని చెప్పింది.
సింగర్ సునీత గారికి అయితే నేను అంటేనే పడదు. నన్ను చూడడమే ముఖం ఆడో విధంగా పెట్టి చూస్తారు. కావాలనే నా పాటలకు నెగిటివ్ కామెంట్స్ ఇస్తారు. అయితే ఓ సారి పాడడం అయ్యాక ఆమె మైక్ ఆపడం మరచిపోయింది. ఆ టైంలో నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్నా. ఈ అమ్మాయికి అసలు వాయిస్‌లో బేస్ లేదు. కానీ మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందంటూ కీరవాణి సార్‌కి నెగిటివ్‌గా చెప్పింది. ఇయర్ ఫోన్స్ లో ఆ మాటలు నాకు వినిపించాయని పేర్కొంది.
మరోసారి శ్రీరామదాసు చిత్రంలో అంతా రామమయం అనే సాంగ్ పాడాను. అది సినిమాలో మేల్ సాంగ్. అంతకు ముందు నేను చెప్పిన పాటలను రిజెక్ట్ చేశారు. అది శ్రీరాముడు రౌండ్ కాబట్టి రాముడి పాటలే ఎంచుకోవాలి. చివరికి అంతా రామమయం సాంగ్ ఇచ్చాను. దానిని సెలెక్ట్ చేశారు. అది మేల్ సాంగ్ కాబట్టి నేను పాడితే ఎంతో కొంత తేడా తప్పక ఉంటుంది. దానిని పట్టుకుని ముగ్గురు జడ్జీలు నాకు నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. సునీత, కీరవాణి ఏదో మేనేజ్ చేశావని అన్నారు. చంద్రబోస్ అయితే నీ వాయిస్‌లో ఆర్ద్రతే లేదని అన్నారు. అంతకు ముందు ఒక అమ్మాయి సాంగ్ పాడుతూ లిరిక్స్ మరచిపోయింది. ఆ అమ్మాయిని ఏమీ అనలేదు. నాపై ఇంత పక్షపాతం ఎందుకో అర్థం కావడం లేదని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది.