Site icon vidhaatha

KCR | మీ డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆరెస్సే

తెలంగాణ.. ఎగతాళి చేబడ్డ ప్రాంతం..

‘ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని మన చేతులో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకొని పోయాం! పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది! తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎగతాళి చేయబడ్డ ప్రాంతం. పలికిమాలిన ప్రాంతం అని పేరుపెట్టబడిన ప్రాంతం. కానీ, ఎన్నిరంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచాం. రూ.90వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.50లక్షలకు పెంచుకున్నాం. జీఎస్‌డీపీని దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి తీసుకెళ్లాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం’ అని వెల్లడించారు.

ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా?

బీఆరెస్‌ సభ పెట్టుకుంటే పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టారని కేసీఆర్‌ ఆరోపించారు. ‘ఇన్ని అడ్డంకులు సృష్టిస్తారా? ఇంత కడుపు ఉబ్బా..? బీఆర్‌ఎస్‌ సభలను ఆపుతరా? ఈ ప్రభంజనాన్ని ఎవడు ఆపుతడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్కమాట పోలీసు మిత్రులకు మనవి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు సోషల్‌ మీడియాలో వారియర్స్‌ ఉన్నారు. వారు ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ.. వాళ్లపై కేసులు పెడుతున్నరు. పోలీసులను నేను అడుగుతున్నా.. మీరెందుకు దుముకులాడుతున్నరు? మీకు ఏం అక్కరొచ్చింది?’ అంటూ ప్రశ్నించారు.

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్సే..

‘ఒక్కటే చెబుతున్న. ఇవాళ రాత్రి పోయి మీ డైరీల్లో రాసుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. దాన్ని ఎవడూ ఆపలేరు. పోలీసు ఉద్యోగాలు చేస్తున్న మీరు చదువుకోలేదా? వీళ్లు దొంగ వాగ్ధానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు ఎందుకు పెడుతున్నరు? మీరెందుకు రేపు బలవుతరు? మీకు రాజకీయాలెందుకు? మీ డ్యూటీ మీరు చేసుకోండి’ అని వార్నింగ్‌ ఇచ్చారు.

ఫెయిల్‌.. ఫెయిల్‌.. ఫెయిల్‌..

‘ఇవాళ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్‌. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్‌. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్‌. కరెంటు సరఫరాలో ఫెయిల్‌. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్‌. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్‌. ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్‌. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్‌. భూముల ధరలు పెంచడంలో ఫెయిల్‌. మరి దేంట్లో పాస్‌ అయ్యారు? ఎటుపడితే అటు ఒర్రుడు.. దేవుండ్లపై ఒట్లుపెట్టుడు.. అబద్ధపు వాగ్ధానాలు చేసుడు.. 20-30శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడు అంతేనా?’ అని కేసీఆర్‌ అన్నారు. 20-30శాతం కమీషన్ల మాట తాను అనడం లేదని, స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు వెళ్లి 200 మంది కాంట్రాక్టర్లు పోయి లొల్లిపెట్టి.. మమ్మల్ని 20-30శాతం కమీషన్లు అడుగుతున్నరు.. ఇదేం అన్యాయం అని చెప్పి అడిగిన మాటనే నేను చెబుతున్నానని అన్నారు.

తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వం

‘ఆనాడైనా, ఏనాడైనా.. ఈనాడైనా తెలంగాణకు విలన్‌ నెంబర్‌ వన్‌ కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ హైదరాబాద్‌ స్టేట్‌ పేరుతో ఉన్ననాడు.. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారే కాంగ్రెస్‌ పార్టీ, జవహర్‌లాల్‌ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. 2001 నుంచి విజృంభిస్తే.. ఇదే కాంగ్రెస్‌ మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తుపెట్టుకొని తెలంగాణ ఇస్తమని నమ్మబలికింది. మళ్లీ ఎగొట్టే ప్రయత్నం చేశారు. 14 సంవత్సరాలు ఏడిపించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు కాంగ్రెస్‌ గొంతుపట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసింది. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం’ అంటూ గుర్తు చేశారు.

పిల్లలకే జవాబు లేదు

‘కేసీఆర్‌ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నరు. దేనికి రావాలి? మీ ముచ్చట్లు వినడానికా? పిల్లలు అడిగితే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నది ఉన్నట్లు నిలబెడితే ఆ ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి.. భుజాలు తడుముకుంటున్నడు. నీకెందుకయ్యా బాధా? నువ్వు తీసుకుంటెనే నీకు బాధ ఉండాలి కదా? లేచి పెద్ద లొల్లి పెడుతున్నడు అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్పారు. మనం కూడ గోల్‌మాల్‌ అయిపోయాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాగు గుళ్లే.. మనం సల్లే.. ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారు.

ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి.. బర్లకు పాలు పిండితే వస్తయా? ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు కూలగొడితే.. కేసీఆర్‌ అన్న.. యాడున్నవ్‌ నువ్వు రావాలి.. కత్తి వాడితో చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అంతేనా? దీన్ని కూడా ప్రజలు విచారించాలి’ అని కేసీఆర్‌ చెప్పారు. ‘పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్‌ఎస్‌ ఉంటది.. కేసీఆర్‌ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్‌.

Exit mobile version