Site icon vidhaatha

Land Issues | భూ సమస్యల పరిష్కారం.. తెలంగాణలో ఇలా.. ఆంధ్రలో అలా..

హైద‌రాబాద్‌, జూన్‌ 17 (విధాత‌): ఎంతో గొప్పగా చెప్పుకొని, ధరణి స్థానంలో అన్ని సమస్యలకు పరిష్కారమంటూ ఆర్భాటంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం ఆ చిత్తశుద్ధి కనబర్చడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూభారతి చట్టం అమలుకు ముందే రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కొన్ని చోట్ల అదికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా వార్తల్లో వచ్చాయి. ధరణికి పూర్తి భిన్నంగా, అధికారులే సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టానికి రూపకల్పన చేసింది. దీనికి విస్తృతంగా ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం క‌ల్పించ‌డం ద్వారా రైతుల‌కు చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌లిగించాల‌ని నిర్ణయించింది. ఒకేసారి గ్రామంలో ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో రైతుల స‌మ‌స్య‌లు పరిష్క‌రించాల‌ని నిర్ణ‌యించిన రేవంత్ రెడ్డి స‌ర్కారు గ్రామ గ్రామాన రైతు స‌ద‌స్సులు నిర్వహిస్తున్నది. రైతులు చేసుకొనే దరఖాస్తులను కూడా చాలా సుభరీతిలోనే తయారు చేశారు. అయితే.. అమలు తీరు మాత్రం రైతుల నుంచి వ్యతిరేకతను ప్రోదిచేసేదిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ సదస్సుల్లో అధికారులు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తీసుకున్న దరఖాస్తుకు రశీదు ఇవ్వడం లేదు. దీంతో తాము దరఖాస్తు ఇచ్చినట్టు ఆధారాలేంటన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రశీదులు ఇవ్వకపోవడంతో ఈ దరఖాస్తులను పరిష్కరిస్తారా? లేక చెత్తబుట్టలో వేస్తారా? అని నిలదీస్తున్నారు. అధికారులే స‌మ‌స్య ప‌రిష్క‌రించే విధంగా చ‌ట్టం రూపొందించిన త‌రువాత కూడా సమస్య పరిష్కరించడానికి అధికారులకు ఉన్న ఇబ్బందులేంటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ర‌శీదులు ఇవ్వ‌డం లేదంటేనే ఇంకా ఏదో గూడుపుఠాణీ ఉందా? అనే సందేహాలను రైతులు వ్య‌క్తం చేస్తున్నారు. ధ‌ర‌ణి పేరుతో నాడు కేసీఆర్ భూములు కొట్టేస్తే… రేవంత్ స‌ర్కారు ర‌శీదులు ఇవ్వ‌కుండా ఏమి చేయాల‌నుకుంటుంద‌ని రైతులు స‌ద‌స్సుల వ‌ద్ద‌నే చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం.

దరఖాస్తులో ఉన్న రశీదు ఇవ్వటానికి ఇబ్బందేంటి?

తెలంగాణ ప్ర‌భుత్వం రూపొందించిన రైతు స‌ద‌స్సు ద‌రఖాస్తులో ర‌శీదు కూడా ఉన్న‌ది. అధికారులు సంత‌కం పెట్టి ర‌శీదు ఇవ్వాలి. కానీ.. అధికారులు ర‌శీదులు ఇవ్వ‌డం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలో నిర్వ‌హించిన రైతు స‌ద‌స్సులో నేరుగా తాసిల్దారు పాల్గొన్న‌ప్ప‌టికీ ద‌ర‌ఖాస్తుకు ర‌శీదు ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం. అయితే చాలా గ్రామాల‌లో తాసిల్దార్లు కానీ, ఇత‌ర అధికారులు కానీ రైతుల స‌ద‌స్సుల‌కు వెళ్ల‌కుండా అత్యంత కింది స్థాయి సిబ్బందిని పంపించి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రైతుల స‌ద‌స్సులు తూ తూ మంత్రంగా జ‌రుగుతున్నాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి చొరవ తీసుకుని, పారదర్శకత ఉండేలా చూడాలని పలువురు రైతులు అభ్యర్థిస్తున్నారు.

ఏపీలో అలా..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక స‌భ‌లో మాట్లాడుతూ తనది టీడీపీ కాలేజీ అని ప్రకటించుకున్నారు. అయితే.. రేవంత్‌ చదివిన కాలేజీకి ప్రిన్స్‌పాల్‌గా ఉన్న చంద్రబాబు నాయుడు పాలిస్తున్న ఏపీలో రెవెన్యూ సదస్సులు చాలా పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ అధికారులు సైతం పేర్కొంటుండటం గమనార్హం. తన ప్రిన్సిపాల్‌ పాలిస్తున్న రాష్ట్రంలో సదస్సులు జరుగుతున్న తీరును పరిశీలించి, అధికారులకు మార్గనిర్దేశం చేయొచ్చు కదా.. అని అంటున్నారు. ఏపీలో భూమి సమస్యల పరిష్కారంలో పారదర్శక పద్ధతి అమలు అవుతున్నదని పలువురు అధికారులు చెబుతున్నారు. దేశంలో ఎక్క‌డ మంచి ప్రాక్టీస్ అమ‌లులో ఉంటే దాన్ని తీసుకోవాలని అంటున్నారు. ఏపీలో రెవెన్యూ స‌ద‌స్సుల‌లో నిర్దేశించిన అధికారులు పాల్గొంటున్నారు. వారు తమ వెంట కంప్యూటర్‌ ఆపరేటర్లు, కంప్యూటర్లను తీసుకువెళుతున్నారు. రైతులు మ్యాన్యువ‌ల్‌గా ద‌ర‌ఖాస్తు చేసి, అధికారికి ఇచ్చిన వెంట‌నే అధికారి ద‌ర‌ఖాస్తుపై సంత‌కం చేస్తాడు. కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్లు అక్క‌డే ద‌ర‌ఖాస్తును స్కాన్ చేసిఅప్‌లోడ్ చేసి తిరిగి రైతుల‌కు అందిస్తున్నారు. రైతుకు అధికారులు సంత‌కం చేసిన ద‌ర‌ఖాస్తే రశీదు. స్కాన్ చేసిన వెంట‌నే రైతుకు ఒక ఐడీ నంబర్‌ క్రియేట్ అవుతున్న‌ది. ఆ నంబర్‌తో ప్ర‌భుత్వంనుంచి నేరుగా రైతు మొబైల్‌కు మెసేజ్ వస్తున్నది. సదరు రైతు తన దరఖాస్తును ఏ అధికారికి ఇచ్చారో తెలియజేస్తూనే.. త్వరలోనే అధికారులు సంప్రదిస్తారని పేర్కొంటున్నారు. మేసేజ్‌లో చెప్పిన తేదీకి సదరు అధికారి రైతు పొలం వ‌ద్ద‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, ఫోటో దిగి కంప్యూట‌ర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇంత‌టితో రైతుకు ప్ర‌భుత్వానికి మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఆగిపోదు. నిజంగా అధికారి స‌మ‌స్య‌ను పరిష్క‌రించాడో లేదో మళ్లీ రైతుకు ఫోన్‌ కాల్‌ వస్తుంది. వాయిస్‌ ఇంటరాక్షన్‌లో ఉండే ఈ కాల్‌లో స‌మ‌స్య ప‌రిష్కార‌మైందా? అని అడుగుతారు. పరిష్కారం అయితే.. ఒక నంబరు.. లేకపోతే మరో నంబరు.. అధికారి రాకపోతే మరో నంబరు నొక్కాలని సూచిస్తుంది. దీంతో రైతులకు తమ దరఖాస్తుల పరిష్కారం విషయంలో స్పష్టత, పారదర్శకత ఉంటున్నది. ఇలాంటి పాలోఅప్‌ తెలంగాణలోనూ అవసరమని అంటున్నారు.

అధికారులు నిత్యం టచ్‌లో ఉండాలి

ఏపీ ప్ర‌భుత్వం నిత్యం రైతుల‌తో ట‌చ్‌లో ఉండే విధంగా మెకానిజం ఏర్పాటు చేసింది. చంద్ర‌బాబు కాలేజీలో చ‌దువుకున్న రేవంత్ రెడ్డి ఈ విధానం ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని రైతులు అడుగుతున్నారు. నిత్యం ప్ర‌భుత్వం త‌మ‌తో ట‌చ్‌లో ఉండే విధంగా వ్య‌వ‌హ‌రిస్తే.. అధికారులు కానీ, ప్ర‌భుత్వ ఇత‌ర పెద్దలు ఎవ‌రైనా త‌మ భూములు కాజేయ‌డానికి కుట్ర చేసినా.. భారీ ఎత్తున లంచాలు తీసుకోవ‌డానికి య‌త్నించినా ప్ర‌భుత్వానికి తెలియ‌జేసే అవ‌కాశం ఉంటుంద‌ని చెపుతున్నారు. ఇప్ప‌టికైనా రైతుల స‌ద‌స్సులు పార‌ద్శ‌కంగా నిర్వ‌హించి, ర‌శీదులు ఇవ్వ‌డ‌మే కాకండా వెంట‌నే కంప్యూట‌రీక‌రించాల‌ని తెలంగాణ రైతులు కోరుతున్నారు.

Exit mobile version