Harish Rao | రేవంత్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ నెలకు ఒక్కసారి కూడా సచివాలయానికి పోవడం లేదని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరగడమే రేవంత్ కు సరిపోతుందని ఎద్దేవా చేశారు. సోమవారం నర్సాపూర్ పర్యటనలో భాగంగా హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి చిప్పల్ తుర్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామంలోని చెత్త ట్రాక్టర్లో డీజీల్ లేక 20రోజులుగా చెత్త సేకరించడం లేదన్నారు. గ్రామాలు స్వచ్ఛంగా ఉండాలని కేసీఆర్ ట్రాక్టర్లు ఇస్తే వాటిలో డీజిల్ పోయని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండన్నారు. హస్తం పార్టీ అన్న మార్పు ఇదేనా? పల్లేలపై మీకు ఉన్న పట్టింపు ఇదేనా అని ప్రశ్నించారు.
మూడు నెలలకుగా సఫాయి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు కానీ, ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. పల్లెల్లో కనీసం వీధి లైట్లు పెట్టడానికి కూడా డబ్బులు లేవని అధికారులు చెబుతున్నారన్నారు. మీకు హెలికాప్టర్లో ఇంధనం పోయడానికి డబ్బులు ఉంటాయి కానీ, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవా అని ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వస్తేనే బిల్లులు రిలీజ్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సఫాయి కార్మికులు కమీషన్లు ఇవ్వరనే జీతాలు చెల్లించడం లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపు బీఆర్‌ఎస్ పార్టీ నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కాదని, పరిపాలన కూడా చేయాలన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చుంటే రాష్ట్రంలోని సమస్యలు తెలుస్తాయా అని అన్నారు.
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు ఇచ్చి ఇంటింటికీ చెత్తబుట్టలిచ్చి, డంప్ యార్డులు నిర్మించి స్వచ్ఛమైన పల్లెలుగా తయారు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపిస్తాయన్న హరీశ్‌రావు.. చెత్త సేకరణ జరగకపోతే దోమలు పెరిగి మలేరియా, డయేరియా వంటి రోగాలు వస్తాయని చెప్పారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఎక్కడైనా మంచినీళ్ళ పైపులు పగిలిపోయినా వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదన్నారు. కనీసం గ్రామాల్లో వీధి దీపాలు పెట్టె పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదా అని ప్రశ్నించారు హరీష్ రావు.