Site icon vidhaatha

కమిషనర్ ఆర్.వి. కర్ణన్ : దత్తత తీసుకున్న కుక్కపిల్లలను కుటుంబ సభ్యుల్లా ఆదరించాలి

ghmc-indie-puppy-adoption-mela-hyderabad-rv-karnan

హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిని కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జలగం వెంగలరావు పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇండీ పప్పీ దత్తత మేళా ” ను కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఖైరతాబాద్‌ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కలిసి ప్రారంభించారు. డీ–వార్మ్‌ చేసిన, వ్యాక్సిన్‌ వేసిన, ఆరోగ్యంగా ఉన్న అందమైన 39 దేశీ కుక్కపిల్లలను ఈ మేళాలో ప్రదర్శించారు. కుక్కలంటే ఇష్టపడే ప్రజలు ఈ మేళాకు హాజరై ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్నవారు వాటిపై చూపుతున్న ప్రేమాభిమానాలు ప్రశంసనీయమని అన్నారు. కుటుంబ బంధాలను మరింత బలపరచే ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తొలి దత్తతగా కూకట్‌పల్లి కి చెందిన సి.హెచ్. సాయికి ఒక కుక్కపిల్లను స్వయంగా కమిషనర్ అందజేసి అభినందించారు. మేళాలో మొత్తం 24 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ దత్తత తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం “బి ఏ హీరో.. అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఆకట్టుకుంది.

Exit mobile version