విధాత : రేపో మాపో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కే. జానారెడ్డి (Janareddy) కాంగ్రెస్ హైకమాండ్ కు రాసిన లేఖ సంచలనంగా మారింది. కేబినెట్ విస్తరణలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కే.సీ.వేణుగోపాల్ లకు లేఖలో విజ్ఞప్తి చేశారు. కేబినెట్ లో స్థానం కల్పించాలని ఆ జిల్లాల ఎమ్మెల్యేలు పార్టీ హైకమాండ్ కు చేసుకున్న విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించాలని జానారెడ్డి కోరారు. వారికి కేబినెట్ లో అవకాశం కల్పించే నిర్ణయం ప్రజల ప్రయోజనాలకు మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.
మాలో ఒకరికి కేబినెట్ చాన్స్ ప్లీజ్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 స్థానాల్లో 4 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో మల్‌రెడ్డి రంగారెడ్డి ( ఇబ్రహీంపట్నం), ప్రసాద్ కుమార్ (వికారాబాద్), రామ్మోహన్ రెడ్డి (పరిగి), మనోహర్ రెడ్డి (తాండూరు)లు ఉన్నారు. వీరంతా కేబినెట్ పదవి కోసం ఇన్నాళ్లుగా విడివిడిగా ప్రయత్నాలు చేసి విఫలమవ్వడంతో ఇక ఉమ్మడి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ నలుగురిలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని వారు కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాశారు.
ఈ మేరకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు తమ అభ్యర్థనను తెలియచేశారు. వారు రాసిన లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. తమలో ఒకరికి కేబినెట్ లో అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. మొత్తం రాష్ట్ర జనాభాలో 42శాతం జనాభా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో ఉందని..త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయని ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆ ఎమ్మెల్యేలు గట్టిగానే తమ గళం వినిపిస్తున్నారు.