Rains in Telangana | రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో సాధారణ వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారి చేసింది.
అలాగే, ఏపీలోని ఉత్తర కోస్తా, యానంలలోని పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి సాధారణ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల స్పీడ్ తో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.