Rain Revives Crops Telangana | విధాత ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయంలో పడిన వానలతో అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి.. రైతులను ఆపద సమయంలో ఆదుకున్నాయి. ఎండిపోతున్న వివిధ రకాల పంటలకు మళ్ళీ ఊపిరి పోశాయి. ప్రధానంగా మెట్టపంటలకు తిరిగి జీవం వచ్చింది. గత వారం రోజుల వ్యవధిలో వివిధ జిల్లాలో ఒకటి, రెండు రోజులు కురిసిన వర్షాన్ని ‘బంగారు వాన’గా పలువురు అన్నదాతలు అభివర్ణిస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టినా ఈ వానకు ఖరీదుకట్టలేమని, అంత విలువైన వాన ఇదని సంతోషంగా చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సీజన్ కు వారం రోజులుగా ముందుగానే ప్రవేశించాయి. దీంతో రైతుల్లో సంతోషం వ్యక్తమైంది. రోహిణి కార్తెకు ముందు నుంచే కురిసిన వర్షాలకు దుక్కులుదున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. వరి తదితర పంటలకు నార్లు పోసుకోగా, పత్తి, మొక్కజొన్న తదితర మెట్టపంటల సాగు భారీగా చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో పలు జిల్లాల్లో పత్తి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. మొక్కలో ఎదుగుదల ఆగిపోయింది. ఈ స్థితిలో పత్తి మొక్కలను కాపాడుకునేందుకు కొన్ని రైతులు `బిందె` సేద్యానికీ సిద్ధమయ్యారు. ట్రాక్లర్లు, ట్యాంకర్లు, ఎడ్లబండ్ల పై డ్రముల్లో నీళ్ళు తెచ్చి నీరు పోసి మొక్కలు సచ్చిపోకుండా తమ వంతు ప్రయత్నాలు చేపట్టారు. వర్షాలు కురువకపోతాయా.. మళ్ళీ పంట చిగుర్లు తొడుగకపోతుందా.. అనే రైతుల ఆశ ఫలించింది. ఈ వారం రోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో కురిసిన తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు మెట్టపంటలకు ఊపిరిపోశాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మెట్టపంటలకు ఊపిరి
తాజాగా కురిసిన వర్షాలతో మరో వారం, 15 రోజుల వరకు వర్షాలు కురవకపోయినా భూమిలో ఏర్పడిన తేమ పత్తి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, కంది, పెసర, పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయాబీన్, మంచి శెనగలు తదితర మెట్టపంటలకు ఉపయోగకరంగా మారింది. వరి సాగుకు నారు పోసుకున్న రైతులు నాటుకు ముందస్తు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే వరి నారు ఏపుగా పెరిగి నాటుకు సిద్ధంగా ఎదిగాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో చేరిన నీటి విడుదల కార్యక్రమం దశలవారీగా చేపడుతున్నందున ఆయా ప్రాజెక్టుల పరిధిలో రైతులు నాట్లకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో మెజారిటీ మెట్టపంటలు వర్షాధారం పై ఆధారపడి సాగు చేస్తుంటారు. ప్రస్తుతం రైతులు తమకు అందుబాటులో ఉండే బావులు, బోర్ల నీటిని వినియోగించుకుంటున్నారు. తాజా వర్షాలు, నీటి విడుదలతో పంట సాగు విస్తీర్ణం పెరగనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
సగానికి చేరుకున్న పంటల సాగు
రాష్ట్రవ్యాప్తంగా ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్ లో సగం మాత్రమే పంటల సాగు జరిగింది. రాష్ట్రంలో సాధారణ సాగు విస్తీర్ణం 1.32.44.305 ఎకరాలు కాగా, ప్రస్తుతం 61,63,098 ఎకరాలు సాగు చేశారు. మొత్తం సాగులో 46.13శాతం విస్తీర్ణంలో పంటల సాగు జరిగింది. తాజా వర్షాలు, నీటి విడుదలతో మరి కొంత విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల ప్రభావం ముఖ్యంగా వరి సాగు పైన తీవ్ర ప్రభావం కనబరిచింది. రాష్ట్రంలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 62,47,868 ఎకరాలుండగా ప్రస్తుతానికి 7,78,294 ఎకరాల్లో మాత్రమే సాగయ్యింది. అయితే సీజన్ లో ఈ సమయానికి సాధారణ విస్తీర్ణం 7,94,961 ఎకరాలుకాగా, గత ఏడాది ఈ సమయానికి 49,3,510 ఎకరాలు మాత్రమే సాగైనందున ఈ సీజన్ పై కూడా ఆశలున్నాయి. సాగు పెరుగుతోందని ఆశాభావంతో రైతులు, వ్యవసాయశాఖ అధికారులున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొక్కజొన్న 44,9, 913 ఎకరాలు, జొన్న 28002, కంది 34,3,823 ఎకరాలు, పెసర 4,0165 ఎకరాలు, సోయాబీన్ 33,0686 ఎకరాలు, పత్తి 38,56,884 ఎకరాల్లో సాగు చేశారు.