Ooty Weather | సమ్మర్ వెకేషన్ అంటే చాలా మంది ఊటీవైపే చూస్తుంటారు. ఎండల నుంచి సేదదీరేందుకు అక్కడికి ప్రయాణం కడుతుంటారు. ప్రత్యేకించి మార్చి నుంచి మే వరకూ టూరిస్టుల సందడి ఎక్కువగా ఉంటుంది. అయితే.. మారిన వాతావరణ పరిస్థితులు, నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తమిళనాడులోని నీలగిరి, కోయంబత్తూరు సహా ఎనిమిది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆదివారం వర్ష బీభత్సం మరీ ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. ఈ మూడు రోజులూ ఊటీలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడనున్నాయి. నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, దిండిగల్, థేని, కన్యాకుమారి, తిరునెల్వేలి, టెంకాసి జిల్లాల అధికారులు ముందుస్తు సహాయ చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహార నిల్వలను సైతం సిద్ధం చేస్తున్నారు. ఊటీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఊటీ ఘాట్ రోడ్లపై కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమయ్యారు.
ఆదివారం నీలగిరి, కోయంబత్తూరు జిల్లాల్లోని ఘాట్ ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర దిశగా మళ్లీ ద్రోణి ఏర్పడుతుందని పేర్కొన్నది. సోమవారం, మంగళవారం ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, నీలగిరిలోని ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత అతిభారీ వర్షాలు కురిస్తాయని హెచ్చరించింది. థేని, దిండిగల్, టెంకాసి ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. గత పదిరోజులుగా నీలగిరి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎలాంటి విపత్తునైనా తట్టుకునేలా సహాయ చర్యలు చేపడుతున్నామని నీలగిరీస్ జిల్లా కలెక్టర్ తన్నీరు లక్ష్మీ భవ్య మీడియాకు తెలిపారు. 42 సహాయ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 456 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా టోల్ ఫ్రీ నంబర్ 1077కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.