Site icon vidhaatha

MLC KAVITHA | నేను అంత మంచి కాదు.. రౌడీ టైపు: ఎమ్మెల్సీ కవిత

విధాత: నేను కేసీఆర్‌ అంత మంచివాణ్ణి కాదు.. రాసిపెట్టుకోండి.. మళ్లీ బరాబర్ మా టైం వస్తుందని.. బీఆర్ఎస్ వారిపై అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని.. రిటైర్ అయ్యి విదేశాలకు వెళ్లిన వారిని సైతం వదిలేది లేదు’ అని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా నిలిచాయి. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ నిర్భంధ..రాజకీయ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందంటూ విమర్శించారు. మళ్లీ మన రాజ్యం వస్తుందని..బీఆర్ఎస్ వారిని వేధించిన వారిని ఒక్కరిని వదిలేది లేదంటూ వ్యాఖ్యానించారు. నేను కేసీఆర్ అంత మంచివాణ్ణి కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలు మరవకముందే ఇప్పుడు ఆయన చెల్లెలు కవిత కూడా సరిగ్గా అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తిరేపింది.

బరాబర్ పింక్ లో పేర్లు రాస్తం

బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) మాట్లాడుతూ కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు.. నేను కొంచం రౌడీ టైపు అని చెప్పుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను బెదిరించే వారిని ఏ ఒక్కరిని వదిలేది లేదని పింక్ బుక్ బరాబర్ పెడుతాం.. అందులో వారి పేర్లను రాసిపెడుతం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని..ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్‌లో రాసుకుంటామన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదన్నారు. కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదన్నారు. కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు భయపడేదే లేదన్నారు. వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లెవరూ లేరన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. ఎంపీ ఎన్నికల్లో జీరో స్థానాలకు పడిపోయి..ప్రధాన నాయకులందరిపై పలు విచారణలు కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ రజతోత్సవ సభ జరుగబోతుంది. ఈ క్రమంలో సన్నాహక సమావేశాల్లో పార్టీ కేడర్ లో ఉత్సాహం నింపేందుకు.. భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు కేటీఆర్, కవితలు మేం మంచోళ్లం కాము అన్న రీతిలో వ్యాఖ్యలు చేసి..రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు చేశారు. అయితే వారు ఏ సందర్భంలో అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికి కేటీఆర్, కవితలు వారి గురించి కరెక్టుగానే చెప్పుకున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ వర్గాలు సెటైర్లు వేస్తుండటం ఆసక్తికరం.

Exit mobile version