Mahesh Babu |
విధాత షూటింగ్ కారణంగా సోమవారం విచారణకు హాజరుకాలేకపోతున్నానని..మరో తేదీ ఇవ్వాలంటూ టాలీవుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ రాశారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును 27,28వ తేదీలలో విచారణకు రావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అయితే దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్న మహేష్ బాబు తాను ఆ తేదీన విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. విచారణకు మరో తేదీ ఇవ్వాలని కోరుతూ ఈడీకి లేఖ రాశారు.
సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల ప్రమోషన్ కోసం మహేశ్ బాబు చెక్కుల రూపంలో రూ. 3.4 కోట్లు, నగదు రూపంలో రూ. 2.5 కోట్లు కలిపి మొత్తం రూ. 5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రజలను ప్రభావితం చేశారని, ప్రమోషన్ల పేరుతో భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 22న మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే అప్పటికే ఖరారైన సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరుకాలేకపోయారు.