న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై మనీలాండరింగ్ కేసులో ఈడీ రాబర్ట్ ఛార్జీషీట్
దాఖలు చేసింది. యూకేకి చెందిన ఆయుధాల డీలర్ సంజయ్ భండారీకి సంబంధించిన కేసులో రాబర్ట్ వాద్రాపై ఛార్జీషీట్ నమోదైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఛార్జిషీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది. దీనిపై ఢిల్లీ కోర్టు డిసెంబర్ 6న విచారణ చేపట్టనుంది. ఇదే కేసులో ఈ ఏడాది జులైలో రాబర్ట్ వాద్రాను ఈడీ ఐదు గంటలపాటు ప్రశ్నించింది. ఈ సందర్బంగా ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాజాగా ఈ కేసులో ఈడీ చార్జీ షీట్ దాఖలు చేసింది.
గతంలో గుర్గావ్‌లోని సెక్టార్ 83లో షికోహ్‌పూర్‌లో 3.53 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జీ షీట్ దాఖలు చేయడం గమనార్హం. అప్పట్లో తనపై కేసులు రాజకీయ ప్రేరేపితం అని వాద్రా ఆరోపించారు. తాను గాంధీ కుటుంబంలో భాగం కావడం వల్లే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అదే తాను బీజేపీలో చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని విమర్శించారు.
