విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ నియోజకవర్గ అధికార బీఆరెస్ లో నేతల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కింది. ఆ పార్టీలో కీలకంగా ఉన్న పిల్లి రామరాజును సస్పెండ్ చేశారు. గతంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అనుంగు శిష్యుడుగా రామరాజు తెరపైకి వచ్చారు. ఏడాదిగా ఎమ్మెల్యేతో విభేదించాడు. పార్టీలోనే సొంత కుంపటి పెట్టాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గు మంటున్న పరిస్థితి నెలకొంది. పోటాపోటీ కార్యక్రమాలతో పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేగా కంచర్ల, కౌన్సిలర్ గా, బీఆరెస్ పట్టణ అధ్యక్షులుగా రామరాజు వినాయక విగ్రహాల పంపిణీ దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఇలా పోటాపోటీగా నిర్వహించారు.
పిల్లికి బీఆరెస్ తో సంబంధం లేదు..
నల్గొండ బీఆర్ఎస్ అసమ్మతి నేత పిల్లి రామరాజుపై ఆ పార్టీ నేతలు సస్పెన్షన్ వేటు వేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలసి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నిరంజన్, వలీ మీడియా సమావేశంలో సస్పెన్షన్ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందుకు అధిష్టానం సీరియస్ గా పరిగణించిందని పేర్కొన్నారు. రామరాజు నిర్వహించే సమావేశాలు, ఇతర రాజకీయ కార్యక్రమాలకు, బీఆరెస్ కు సంబంధం లేదని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
సస్పెన్షన్ పై పిల్లి రామరాజు ఆగ్రహం
పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల పట్ల పిల్లి రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతగా తాను ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేస్తుంటే ఓర్వలేక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనను సస్పెండ్ చేసే అధికారం జడ్పీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు లేదని స్పష్టం చేశారు. త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.
2017 నుంచి బీఆర్ఎస్ లోనే..
తొలుత తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన పిల్లి రామరాజు 2017లో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శిష్యుడిగా ఆయనతో పాటే బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి 2021- 22లో రెండు దఫాలుగా పట్టణ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. కౌన్సిలర్ గా గెలుపొందారు. గత ఏడాది నుంచి ఎమ్మెల్యేతో విభేదిస్తూ, పార్టీలోనే వేరు కుపంటి పెట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తుండటంతో 6 మాసాల క్రితం పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించారు. బోనగిరి దేవేందర్ కు ఆ పదవి అప్పజెప్పారు. ఈ క్రమంలో రామరాజు తన కార్యక్రమాలను ముమ్మరం చేసి, ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు ప్రకటించుకున్నారు.