Site icon vidhaatha

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో జైషే చీఫ్ మసూద్ సోదరుడు రవూఫ్ హతం

Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో జైషే ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు, అబ్దుల్ రవూఫ్ అజర్ హతమయ్యారు. పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జైషే కార్యాలయంపై భారత్ జరిపిన దాడిలో మసూద్ పది మంది కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ దాడిలోనే తీవ్రంగా గాయపడిన అబ్దుల్ రవూఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అబ్దుల్ రవూఫ్ అజార్ ను ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో చేర్చింది. ఇతడిని పట్టుకోవడం కోసం నిఘా సంస్థలు పని చేస్తున్నాయి.

భారత్ వ్యతిరేక దాడుల్లో మాస్టర్ మైండ్

అబ్దుల్ రవూఫ్ అజర్ భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించిన దాడులు, కుట్రల్లో అతను మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. అబ్దుల్ రవూఫ్ పాకిస్తానీ దేవబంది జిహాదిస్ట్ మతాధికారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతడు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) సుప్రీం కమాండర్‌గా పనిచేశాడు. రవూఫ్ తన 24 ఏళ్ల వయసులోనే 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కందహార్ ఐసీ-814 హైజాక్‌ చేయడంలో కీలక సూత్రధారి. విమానం హైజాక్ చేసి.. జైల్లో ఉన్న తన సోదరుడు, జైషీ మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‎ను జైలు నుంచి విడిపించాడు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ, భారత పార్లమెంటుపై 2001 ఫిదాయీన్ దాడులు, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, నగ్రోటా, కథువాలో సైనిక శిబిరాలపై దాడులు వెనక కూడా రవూఫ్ కీలకంగా వ్యవహరించాడు. 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని బలిగొన్న 2019 పుల్వామా ఎటాక్‎తో కూడా రవూఫ్‎ ప్రమేయం ఉంది. అంతర్జాతీయ జిహాదీ నెట్ వర్క్‌లలోనూ అజార్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

Exit mobile version