విధాత: పహల్గాం దాడిని ఖండిస్తూ జమ్మూకశ్మీర్ లో నిర్వహించిన బంద్ బుధవారం ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. ఉగ్రదాడిని నిరసిస్తూ కశ్మీర్ ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆరేళ్లలో తొలిసారిగా కశ్మీర్ లో బంద్ నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో తొలిసారి బంద్ ఇదే కావడం విశేషం. పహల్గాం దాడిని ఖండిస్తూ జనం దుకాణాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, విద్యాసంస్ధలు మూసివేసి వీధుల్లోకి వచ్చారు.
శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించారు. గతంలో భారత్ వ్యతిరేక నిరసలకు, భారత ఆర్మీకి వ్యతిరేక నిరసనలకు వేదికగా ఉండే లాల్ చౌక ప్రాంతంలో జనం ఉగ్రవాద వ్యతిరేక నిరసనలు నిర్వహించడం విశేషంగా మారింది. పర్యాటకులను చంపి ఉగ్రవాదులు మా పొట్ట కొడుతున్నారని..పర్యాటకులు వెనక్కి పోతున్నారని..బుకింగ్ లు రద్దు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత సైనికులపై దాడులు చేసిన లాల్ చౌక్ ప్రాంతం నేడు ఉగ్రవాదుల వ్యతిరేక ఆందోళనలకు వేదికవ్వడం కశ్మీరీలలో వచ్చిన మార్పుకు నిదర్శనమంటున్నారు భద్రతాధికారులు.
ఉగ్ర దాడికి సూత్రధారి కసూరీ
పహల్గాం ఉగ్రదాడికి లష్కరే తోయిబాకు చెందిన కమాండర్ సైఫుల్లా కసురీ అలియాస్ ఖలీద్ వ్యూహకర్తగా ఉన్నట్లు నిఘా విభాగాలు అనుమానిస్తున్నాయి. సైఫుల్లా కసురీకి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడిగా పేరు ఉంది. లష్కరే తోయిబా పెషావర్ హెడ్‌క్వార్టర్స్‌కు కసూరీఅధిపతిగా ఉన్నట్లు సమాచారం.