KTR : రాహుల్ గాంధీ…మీ సీఎం ఏం చేస్తున్నాడో మీకు తెలుసా?

కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించడంపై కేటీఆర్ రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

KTR Vs Rahul Gnadhi

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణ అవకతవకలు..అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ రాహుల్ గాంధీ(Rahul Gandhi).. మీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఏం చేస్తున్నాడో మీకు తెలుసా? అంటూ ఆయన కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కి ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘సీబీఐ(CBI) అంటే బీజేపీ ‘ప్రతిపక్షాల నిర్మూలన సెల్’ అని..బీజేపీ జేబు సంస్థ సీబీఐ అని మీరు గతంలో అన్నారని…మీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కేసును అదే సీబీఐకి అప్పగిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

గతంలో సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన ట్వీట్ ఫోటోను ట్యాగ్ చేస్తూ ఆయనకు కేటీఆర్(KTR) ప్రశ్నలు సంధించారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతాం. న్యాయవ్యవస్థపై, ప్రజలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. సత్యమేవ జయతే’ కేటీఆర్ తన ట్వీట్ లో స్పష్టం చేశారు.