విధాత, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51% హిందూ బీసీలు ఉంటే 10% ముస్లిం బీసీలు కలుపుకుంటే 61 శాతం ఉండేవారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు కుటుంబ సర్వే, కులగణన పైన శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో 51 శాతం మంది బీసీలు 47 శాతానికి ఎట్లా తగ్గిందని ప్రతి ఒక్క బీసీ బిడ్డలు అడుగుతున్నారన్నారు. పదేండ్ల తర్వతా బీసీ జనాభా ఏవిధంగా తగ్గిందో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ సర్వే ను తగలబెట్టమని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అంటున్నారు. ఈ రోజు ప్రభుత్వం సభలో పెట్టిన సమాచారంలో కోత్త ఏం లేదు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే మాట మొన్న మీడియాతో చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి ఈ ప్రభుత్వం కొత్తగా చెప్పింది ఏమిటన్నారు. 42 శాతం బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ బిల్లు తెస్తారని అనుకున్నాం కాని అలా లేదన్నారు.