MLA Mandala Samel | తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. లిక్కర్ సిండికేట్ దగ్గర ఆయన డబ్బులు తీసుకుంటున్నట్టు ఈ వీడియోలో కనిపిస్తున్నది. దీంతో ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఈ అంశం చర్చనీయాంశం అయ్యింది. తాను ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచానని.. తనకు ప్రస్తుతం రోజుకు రూ. లక్ష ఖర్చవుతున్నదని ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాలంటూ సామేల్ వ్యాఖ్యానించడం గమనార్హం. కచ్చితంగా ప్రతి నెల లిక్కర్ సిండికేట్ వాళ్లు తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఓపెన్ గా లంచాలు తీసుకుంటుంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ‘నాకు తక్కువ డబ్బులు ఇస్తానంటే కుదరదు. మీ మీద చర్యలు తీసుకుంటా.. కొందరు వైన్స్ యజమానులు ఇస్తున్న పైసలు నాకు టీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదు’ అంటూ సామేల్ బెదిరించడం గమనార్హం. అయితే లంచం తీసుకున్న సమయంలో వైన్స్ యజమానులే ఈ వీడియోను చిత్రీకరించి బయటకు లీక్ చేసినట్టు తెలుస్తున్నది.
అది మార్ఫింగ్ వీడియో
కాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో తనది కాదని.. మార్ఫింగ్ వీడియో అని సామేల్ పేర్కొనడం గమనార్హం. తనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేకే ప్రతిపక్షాలు కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టం లేకనే కొందరు తనపై కుట్రలు చేశారని మండిపడ్డారు. తన ఇంట్లో తిని తనకే విషం పెట్టి వెళ్లారన్నారు. తన దగ్గర వీడియోలు ఉన్నాయని తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడని.. ఆ వీడియోలు ఎక్కడైనా మడిచి పెట్టుకోవచ్చని తనకు ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఇదంతా తీన్మార్ మల్లన్న కుట్ర అంటూ
ఎమ్మెల్యే సామేల్ పేర్కొన్నారు. ‘ఇంకోసారి బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే తొక్కుతా’ అంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు.