Encounter | చత్తీస్ గఢ్ లో బుధవారం జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 28మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం. నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్ లో భాగంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 28మంది మావోయిస్టులు మృతి చెందగా..మరికొందరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఎదురు కాల్పుల్లో ఒక పోలీస్ సహాయకుడు చనిపోగా..మరో జవాన్ గాయపడినట్లుగా నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేశవరావు
మాధ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. కేశవరావు పై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. కేశవరావు ఉన్నాడనే సమాచారంతోనే బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాల నుంచి డీఆర్జీ బలగాలు ఎన్ కౌంటర్ లో పాల్గొన్నాయని సమాచారం. నంబాల కేశవరావు మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మావోయిస్టు పార్టీలో పని చేశారు. వరంగల్ ఆర్ఈసీ ఇంజనీరింగ్ చదివారు. ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన తండ్రి ఉపాధ్యా యుడు. కేశవరావు మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశారు. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉన్న నంబల కేశవ రావు గెరిల్లా యుద్ధ వ్యూహాలలో నిపుణులు. ఐఈడీ పేల్చడంలో దిట్టగా చెబుతారు. మావో సుప్రీం కమాండర్ ఎన్కౌంటర్ చంద్రబాబుపై అలిపిరిలో బాంబుదాడి ప్రధాన సూత్రధారిగా కూడా నంబాల కేశవరావు వ్యవహరించారు.
2010లో చత్తిస్ గఢ్ లో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారిగా ఉన్నారు. నంబాల కే ఉన్నారన్న సమాచారంతోనే మాధ్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టిముట్టినట్లు తెలుస్తోంది. ఘటన ప్రాంతంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల చత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట ప్రాంతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్ లో భద్రత బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే.