Site icon vidhaatha

operation-kagar | కర్రెగుట్టల్లో క్షణక్షణం.. టెన్షన్‌ టెన్షన్‌!

విధాత ప్రత్యేక ప్రతినిధి:
operation-kagar | మూడు రోజులుగా వేలమంది సాయుధ బలగాల దిగ్భంధంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతంలోని కర్రెగుట్టల్లో ఏం జరుగుతోందనే ఆందోళన తీవ్రమవుతోంది. వివిధ వర్గాల్లో హై టెన్షన్ నెలకొంది. బయటి సమాజంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కర్రెగుట్టల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులతో పాటు ముఖ్యమైన నాయకులున్నారనే సమాచారం మేరకు ఏడెనిమిదివేల మంది మేరకు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, డీఆర్జీ, కోబ్రాతో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర సాయుధ బలగాలు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం చుట్టుముట్టి దిగ్బంధించినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం ఉదయం ధర్మతాళ్ళ గూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పామేడు, పూజారి కాంకేర్ తదితర ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయని చెబుతున్నారు. కర్రెగుట్టల దిగ్భంధం అక్కడ సాగుతున్న కేంద్ర బలగాల ఆపరేషన్ పై పూర్తి స్థాయి సమాచారం తెలియకపోయినా వివిధ వర్గాల ద్వారా అందుతున్న విషయాల మేరకు వివరాలిలా ఉన్నాయి.

రక్తమోడుతోన్న అటవీప్రాంతం
అపరేషన్‌ కగార్‌ పేరుతో కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ అటవీప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలతో పాటు ఆ రాష్ట్ర పోలీసుల ముప్పేట దాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు రక్షణ కోసమా? లేక ఏదైనా సమావేశం కోసమా? ఏదైతేనేం.. పెద్ద సంఖ్యలో కర్రెగుట్టలకు చేరుకున్నారని తెలుస్తున్నది. ఈ సమాచారం తెలిసి వేల సంఖ్యలో సాయుధ బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం భారీ ఎన్‌కౌంటర్‌కు సిద్ధపడటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్రెగుట్టల్లో సాయుధ పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ నుంచి చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీని కోసం హెలికాప్టర్లను, డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. గుట్టలపై బాంబులతో దాడి చేస్తున్నారని తెలుస్తున్నది.

బయటి నుంచి సాయుధ పోలీసులకు అన్ని హంగులు అందుబాటులో ఉన్నందున దూసుకపోతున్నారు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు, ఎల్‌ఈడీలను నిర్వీర్యం చేస్తూ చొచ్చుకపోతున్నారు. బాంబులు, తుపాకుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు ఉన్నతాధికారులు అక్కడే తిష్ఠవేసి.. సాయుధ బలగాలకు డైరెక్షన్స్‌ ఇస్తున్నారు. అటు మావోయిస్టులు కూడా సాయుధ పోలీసు బలగాలను తుపాకులతో అడ్డుకుంటుండటంతో ఇరువైపులా కాల్పుల మోతతో కర్రెగుట్టలు దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టులను ఒంటరి చేసేందుకు గ్రామాలు, గూడేలతో సంబంధం లేకుండా రాకపోకలను నిలిపివేసినట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారనేది తెలియని పరిస్థితి. వారంతా అక్కడ దిగ్బంధానికి గురైన పరిస్థితిలో పోలీసు బలగాలతో తలపడటమో లేక లొంగిపోవడమో తప్ప వేరే దారి లేకుండా పోయిందని చెబుతున్నారు. లొంగిపోయినా ప్రాణాలు దక్కుతాయా? లేదా? తెలియని ఒక రకమైన యుద్ధ వాతావరణం కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ పోలీసులకు సంబంధంలేదు
ఇదిలా ఉండగా సాధారణంగా నిర్వహించే కూంబింగ్‌ మాత్రమే కొనసాగిస్తున్నామని, కర్రెగుట్ట ఆపరేషన్‌కు తెలంగాణ పోలీసు బలగాలకు సంబంధం లేదని రాష్ట్ర మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గురువారం వరంగల్‌లో మీడియాకు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం కూడా లేదనడం గమనార్హం.

Exit mobile version