Site icon vidhaatha

MAOISTS: మావోయిస్టుల సంచలన లేఖ.. భద్రతా బలగాల అలర్ట్ !

విధాత: ఆ ప్రాంతంలో బాంబులు అమర్చాం.. అటువైపు ఎవరు రావద్దంటూ మావోయిస్టు పార్టీ పేరుతో వెలువడిన లేఖ సంచలనంగా మారింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చామని..ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దంటూ వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదలైంది. పోలీసుల మాయ మాటల వలలో పడి కర్రిగుట్ట పైకి ప్రజలు ఎవరూ రావొద్దని లేఖలో హెచ్చరించింది.

కొంతమంది పోలీసుల ప్రలోభాలకు గురై ఇన్ఫార్మర్లుగా మారి కర్రిగుట్టపైకి షీకారు పేరుతో పంపిస్తున్నారని..మేం అమర్చిన బాంబులకు బలవుతున్నారని గుర్తు చేసింది. డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్లుగా మార్చుకుంటున్నారని లేఖలో మావోయిస్టు పార్టీ ఆరోపించింది. కార్పోరేట్ శక్తుల ప్రయోజనాల కోసం బీజేపీ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై, ప్రజాసంఘాలపై, మావోయిస్టులపై దాడులు కొనసాగిస్తున్నాయని ఆరోపించింది.

ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కూడా మా పార్టీపై దాడులు కొనసాగిస్తుందని మావోయిస్టు పార్టీ మండి పడింది. కాగా మావోయిస్టుల లేఖతో ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో భద్రతా బలగాలు హై అలర్ట్ అయ్యాయి. ఆ మార్గంలో వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కర్రిగుట్ట పరిసరాలను జల్లెడ పడుతున్నారు. గిరిజన గ్రామాల్లోని ప్రజలను భద్రతా దళాలు అప్రమత్తం చేశాయి.

Exit mobile version