- నిజామాబాద్ లో రైతు మహోత్సవం
- ప్రారంభించిన మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు
- ఐదు జిల్లాల నుండి హాజరైన రైతులు
విధాత: త్వరలోనే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో జమ చేస్తామని వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత శాఖ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతాంగానికి నష్ట పరిహారం సైతం అందించే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమాన్ని సోమవారం తుమ్మల లాంచనంగా ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ ఆలీ తదితరులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు.
రైతు మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ ఉత్పత్తులు, అధిక దిగుబడులను అందించే అధునాతన వంగడాలు, మేలు జాతి పశువులు, ఆహార పదార్థాల ప్రదర్శనకు దాదాపు సుమారు 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు. సేంద్రీయ విధానంలో పంటల సాగు, ఆధునిక పద్ధతుల్లో లాభసాటి వ్యవసాయం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను అందించే వంగడాలు తదితర వాటి గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఆదర్శ రైతుల ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం తోపాటు, ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా వ్యవసాయ మెళుకువలను అందించడానికి రైతు మహోత్సవ కార్యక్రమం ఎంతగానో ఉపకరిస్తుందని, దీనిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరి కోరిక మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బోర్డును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చి పసుపు రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు, పసుపు ఆధారిత పరిశ్రమలు, ఉత్పత్తులకు కూడా కేంద్రం చొరవ చూపాలని కోరారు. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా కోరుతామని తెలిపారు.
ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలే పరమావధిగా పంట రుణాల మాఫీ కింద రైతుల ఖాతాలలో 33 వేల కోట్ల రూపాయలను జమ చేశామని అన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా రైతుల నుండి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు చేస్తూ, సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుపుతున్నామని అన్నారు. ఆధునిక సాగు, కొత్త పంటల పై రైతులకు మూడు రోజుల ఈ మహోత్సవంలో శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, దీనిని జంతువులు , చీడ పురుగులు నష్టం చేయవని, అందువల్ల పామాయిల్ పంటను రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించే బాధ్యత తనదేనని భరోసా కల్పించారు. కాగా, వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ లను మళ్లీ పునరుద్ధరిస్తూ, నిజామాబాద్ జిల్లాకు వీటి మంజూరీలో ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.