Site icon vidhaatha

Miss World 2025: హైదరాబాద్ అందాల పోటీలో.. నన్ను వేశ్యలా చూశారు: మిస్ ఇంగ్లాండ్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు.. ఖండించిన నిర్వాహకులు

Miss World 2025 | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్‌ – 2025 పోటీలపై మిస్ వరల్డ్ కంటెస్టెంట్, మిస్ ఇంగ్లాండ్-2024 మిల్లా మాగీ చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆమె ఇటీవల ఈ పోటీల నుంచి తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలిగినట్టు తొలుత ప్రకటించినా.. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమను మిస్ వరల్డ్ పోటీల్లో ఆటబొమ్మల్లా చూశారంటూ వాపోయారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఉద్దేశ్యం మంచిదే అయినా.. పోటీల నిర్వహణ తీరు బాగాలేదని వ్యాఖ్యానించారని కొన్ని బ్రిటిష్‌ పత్రికల్లో వచ్చింది.

ధనవంతులను ఆకట్టుకోవాలని తమ మీద ఒత్తిడి చేశారని, తాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్ లోనే ఉండిపోవాల్సి వచ్చేదని వాపోయారు. చివరకు టిఫిన్ చేసేటప్పుడు కూడా మేకప్ తోనే ఉండాల్సి వచ్చేదని పేర్కొన్నారు. సాయంత్రం సమయాల్లో మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తున్నదని ఆమె చెప్పినట్టు బ్రిటిష్‌ పత్రికల్లో కథనాలు వచ్చాయి. తాము అందరినీ అలరించేందుకు కోతులం కాదు కదా అంటూ ఆమె ప్రశ్నించారు.

మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆమె అన్నారు. ఇప్పుడు మాగీ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అందాల పోటీలో నన్ను వేశ్యలా చూశారని..అందుకే మనస్తాపంతో పోటీల నుంచి వైదొలిగినట్టు మాగీ చెప్పారని సన్‌ పత్రిక తెలిపింది.

మిస్ వరల్డ్ పోటీల్లో ఇదే ప్రథమం

పోటీ నుంచి ఒక కంటెస్టెంట్ అర్ధాంతరంగా తప్పుకోవడం 74 ఏండ్ల మిస్ వరల్డ్ పోటీల్లో ఇదే ప్రథమమని తెలుస్తున్నది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ఇప్పుడు ఈ అంశం ఒక అస్త్రంగా దొరికింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ట్రోల్స్ కొనసాగుతున్నాయి. అందాల పోటీలు పెట్టి మరి.. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సర్కార్, బ్రోకర్ రేవంత్ అంటూ విమర్శలు చేసింది. దీంతో మిస్ వరల్డ్ పోటీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ చేస్తుందన్నది ఇప్పుడు మరింత ఆసక్తి కరంగా మారింది.

అవన్నీ ఫేక్‌.. అత్యవసరమని చెప్పి ఆమే వెళ్లిపోయారు..

బ్రిటిష్‌ మీడియాలో వస్తున్న కథనాలను మిస్‌ వరల్డ్‌ నిర్వాహకులు ఖండించారు. అవన్నీ ఫేక్‌ వార్తలేనన్నారు. ఈ మేరకు సంస్థ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా మోర్లే ఒక ప్రకటన చేశారు. మే నెల మొదట్లోనే మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ తనకు ఉన్న అత్యవసర పరిస్థితులు, ఆమె కుటుంబీకు ఆరోగ్య అవసరాల కారణంగా పోటీ నుంచి తప్పుకొంటానని తెలిపారని, తాము సహృదయంతో అంగీకరించి, ఆమెను ఇంగ్లండ్‌ పంపించామని తెలిపారు. ఆమె వైదొలిగిన నేపథ్యంలో ఇంగ్లండ్‌ తరఫున రన్నరప్‌ షార్లెట్‌ గ్రాంట్‌ మూడు రోజులక్రితమే ఇంగ్లండ్‌ నుంచి వచ్చారని, ఆమె ఈ పోటీల్లో పాల్గొంటున్నారని క్లారిటీ ఇచ్చారు. కొన్ని బ్రిటిష్‌ మీడియా సంస్థలు మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలంటూ తప్పుడు కథనాలు ఇస్తున్నాయని అన్నారు.

Exit mobile version