Site icon vidhaatha

Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..విచారణకు కేటీఆర్..కిషన్ రెడ్డి డిమాండ్!

Minister Konda Surekha: కంపెనీల ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు కమిషన్లు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. స్వయంగా మంత్రి కొండా సురేఖ తాను ఆ వ్యాఖ్యలను బీఆర్ఎస్ హయంలో మంత్రులను ఉద్దేశించి చేసినట్లుగా వివరణ ఇచ్చుకున్నప్పటికిి ప్రతిపక్షాలు మాత్రం ఆమె వ్యాఖ్యలను ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలుగా ఎక్కుపెడుతున్నాయి.  కాంగ్రెస్ మంత్రుల అవినీతిని సహచర మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలతో బయటపెట్టారంటూ బీఆర్ఎస్ , బీజేపీలు విమర్శిస్తున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రుల కమిషన్ల దందాపై విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో మంత్రుల వద్ద ఫైల్ కదలాలంటే ఖచ్చితంగా ముడుపులు అందాల్సిందేనన్న సంగతి వెల్లడవుతుందన్నారు. మంత్రుల కమిషన్ల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని..ఎవరెవరు ఎంత కమిషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలని.. మంత్రులు తీసుకున్న కమిషన్ల వివరాలు బయటపెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కమిషన్ల కారణంగా ప్రభుత్వం ఎంతవరకు నష్టపోయిందనేది విచారించాలన్నారు.

అవినీతి ఒప్పుకున్నందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు : కేటీఆర్

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతిని ఒప్పుకున్నందుకు..చివరకు కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు నా అభినందనలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ “కమిషన్ సర్కార్” నడుపుతోంది..ఇది తెలంగాణలో బహిరంగ రహస్యంగా మారడం దురదృష్టకరమని కేటీఆర్ పేర్కొన్నారు. 30% కమీషన్ ప్రభుత్వంలో మంత్రులు కమిషన్లు తీసుకోకుండా ఫైళ్లపై సంతకం చేయరని వారి సహచర మంత్రి వెల్లడించారన్నారు. కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా కూడా చేసి, ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని బయటపెట్టారని గుర్తు చేశారు. కొండా సురేఖ అవినీతి కాంగ్రెస్ మంత్రులందరి పేర్లను బయటపెట్టి సిగ్గుపడేలా చేయాలని నేను కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ ఈ ఆరోపణలపై వారి స్వంత క్యాబినెట్ మంత్రిపై విచారణకు ఆదేశించగలరా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

 

Exit mobile version