Miss Universe | Victoria Kjær Theilvig |Sri Lakshmi Narasimha Swamy | Yadagirigutta
విధాత: రాజాధిరాజులు..చక్రవర్తులు..రాష్ట్రపతులు..ప్రధానులు దర్శించుకున్న యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహుడి (Sri Lakshmi Narasimha Swamy )ని దర్శించుకునేందుకు ఈ దఫా విశ్వసుందరి తరలివచ్చింది. మిస్ యూనివర్స్ విక్టోరియా క్జెర్ థెల్విగ్ (Victoria Kjær Theilvig) మంగళవారం యాదగిరి శ్రీ లక్ష్మినరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలతో సేవించుకుంది. జగద్రక్షుడు..జగన్మోహనుడైన నరసిహుడి దివ్య సౌందర్య ఆరాధనకు తరలివచ్చిన అందాల సుందరి మిస్ యూనివర్స్ విక్టోరియా క్జెర్ థెల్విగ్ కు ఆలయ ఈవో భాస్కర్ రావు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చక బృందం వేద ఆశీర్వచనంతో పాటు శ్రీ స్వామి వారి ఫోటో, ప్రసాదం అందజేశారు.
భారతీయత ఉట్టిపడేలా ముచ్చటగా చీరకట్టులో యాదగిరి నరసన్న సన్నిధికి వచ్చిన విదేశీ వనిత, మిస్ యూనివర్స్ విక్టోరియా క్జెర్ థెల్విగ్ ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూశారు. భారతీయ సనాతన ధర్మం, ధార్మికత వైభవానికి ఇలాంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తాయని విక్టోరియా క్జెర్ థెల్విగ్ రాకను స్వాగతించారు. దర్శనానంతరం మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ అధ్బుత శిల్పకళతో నిర్మితమైన ఆలయ విశిష్టత, ఆలయ సంప్రదాయాలు తదితర వివరాలను ఈవోను అడిగి ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆలయ సందర్శన అనిర్వచనీయ అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
మరియా విక్టోరియా క్జెర్ థెల్విగ్ Victoria Kjær Theilvig) డెన్మార్క్‌కు చెందిన మోడల్. ఆమె 2024లో మెక్సికో సిటీలో జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీలో విజయం సాధించింది. డెన్మార్క్‌కు చెందిన మహిళ మిస్ యూనివర్స్ పోటీలో గెలవడం ఇదే తొలిసారి. ఈ పోటీలో ప్రపంచవ్యాప్తంగా 125 మంది పోటీదారులు పాల్గొన్నారు.