Miss World 2025: విధాత, హైదరాబాద్ః మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. రాష్ట్రంలో మహిళలకు ఎంతో భద్రత ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కూడా మహిళలు ధైర్యంగా రోడ్ల మీద తిరగగలుగుతున్నారని పేర్కొన్నారు. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లో “హెడ్-టు-హెడ్ చాలెంజ్ ఫినాలే నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అందాల భామలు సమాధానం చెప్పారు.
మహిళల భద్రతపై అభినందనలు:
తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని పలువురు స్పష్టం చేశారు. భద్రత అనేది ఒక హక్కు, దానిని అందించడంలో తెలంగాణ మున్ముందు ఉందన్నారు. హైదరాబాద్ నగర వీధుల్లో మహిళలు రాత్రిపూట కూడా భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఇది ఒక సురక్షిత నగరానికి ప్రతీక అని అభివర్ణించారు. పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించామని చెప్పారు. అక్కడ షీ టీమ్స్, హాక్ ఐ, 24×7 పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను పరిశీలించి మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను విశేషంగా అక్కర్శించయని అన్నారు.
తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?
తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, మహిళల హక్కులు, విద్య, సాధికారతకు కూడా అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రంగా పలువురు వివరించారు. ఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తున్నదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్య భావం ప్రత్యేకంగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా అనిపించాయని, ‘బ్యూటీ విత్ పర్పస్’ భావన ఇక్కడ జీవనశైలిలోే కనిపించిందని చెప్పారు.
తెలంగాణ అనుబంధాల తాటిపై నిలిచిన భూమి, స్నేహబంధాలకు నిలయం, సంస్కృతికి ప్రతీకగా భావిస్తున్నామని చెప్పారు.