Site icon vidhaatha

Revanth Reddy | నేను CM అయిన రెండో రోజే.. KCR గుండె పగిలింది! ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో

Revanth Reddy |

విధాత: మావోయిస్టులతో శాంతిచర్చలు.. ఆపరేషన్ కగార్ పై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకే మా ప్రభుత్వ విధానం ప్రకటించబడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనపై సీనియర్ నాయకులు మాజీ మంత్రి కే.జానారెడ్డి, కే.కేశవరావులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌తో ఫోన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. గతంలో శాంతి చర్చల సమయంలో ఉమ్మడి ఏపీ పార్టీ ఇంచార్జిగా దిగ్విజయ్ సింగ్, ఆప్పట్లో హోం మంత్రిగా జానారెడ్డిలు ఉన్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

మావోయిస్టుల శాంతి చర్చల అంశంపై జానారెడ్డి, కే కేశవరావు పార్టీలో చర్చిస్తారని తెలిపారు. గతంలో శాంతి చర్చలు జరిగినప్పటి విషయాలను అధ్యయనం చేస్తున్నామని అన్నారు. ఈ విషయంపై కేకే, జానారెడ్డి, దిగ్విజయ్ సింగ్‌లతో చర్చించినట్లు తెలిపారు. జాతీయ పార్టీలో జాతీయ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరని ప్రశంసించారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదేనని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారని ఆరోపణలు చేశారు.

ఖజానా లూఠీ చేసి మాపై నిందలా

వరంగల్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై తన అక్కసు మొత్తం వెళ్లగక్కారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పదేళ్లు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్‌ ఖజానాను ఖాళీ చేసి మాపై నిందలు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. కేసీఆర్‌ అభద్రతాభావంతో మాట్లాడారని.. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదన్నారు. నేను ముఖ్యమంత్రి అయిన రెండో రోజునే కేసీఆర్ గుండె పగిలిందన్నారు. కేటీఆర్, హరీష్ రావులను పిల్లగాళ్లుగా అభివర్ణించిన కేసీఆర్ మరి వారిని ఎందుకు అసెంబ్లీకి పంపిస్తున్నాడని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయమని ప్రజల నుంచి తమకు డిమాండ్ వస్తోందని చెప్పారు. కక్షసాధింపు చర్యలకు తాను దిగనని, కేటీఆర్ పై కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు.. అన్నీ చట్ట పరిధిలోనే జరుగుతాయని చెప్పారు. కేసీఆర్ లాగా చట్టాన్ని అతిక్రమించి అరెస్టు చేయించనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని సీఎం గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి నాకు మంచి మైత్రి ఉందని..ఇది ఎవరో నమ్మాల్సిన అవసరం లేదని..రాహుల్ గాంధీకి.. నాకు తెలిస్తే చాలు.. బయట ఎవరేం అనుకుంటున్నారు అనేది నాకు అనవసరం అని రేవంత్ స్పష్టం చేశారు.

చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకబడ్డాం

సంవత్సరన్నర నుంచి ప్రజలకు ఉపయోగ పడే ఎన్నో పథకాలు తీసుకు వచ్చామని.. ఇప్పుడు వాటన్నింటిని సమీక్షిస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకబడ్డామని.. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారని.. ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెబుతున్నామన్నారు. తాను ఇంకా ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాను చట్టప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీంలు ఏ రాష్ట్రంలోనూ అమల్లో లేవని తెలిపారు. ఎన్నికలకు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని రేవంత్ రెడ్డి చెప్పారు. గతంలో అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పానని… అలాగే ఆయనకు ఇప్పించానని గుర్తుచేశారు. కొందరు ఓపిక లేక బయట ఏదో మాట్లాడుతున్నారని అలాంటి వారి పట్ల నాకు బాధ్యత ఉండదన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పార్టీ నేతలే నష్టపోతారు’’ అని రేవంత్‌ హెచ్చరించారు.

ఆప్షన్ లేకనే కొంతమంది అధికారుల కొనసాగింపు

అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామని..ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేది ఎలా అని ప్రశ్నించారు. అధికారుల విషయంలో కొంత సమన్వయం పాటించాల్సిన పరిస్థితి ఉందన్నారు. కొందరు అధికారులు అక్రమ సంపాదన మార్గంగా ఉన్నారని..అలాంటివాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. సబ్జెక్ట్ఉన్నవాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భూభారతి, ధరణి అంశాలపై నవీన్‌ మిట్టల్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు.

Exit mobile version