Inland Taipan: పాములు అత్యంత భయానకమైన జీవులన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని విషపూరితం కానివి ఉన్నాయి. అత్యంత విషపూరితమైనవి ఉన్నాయి. కాటు వేసిన కొన్ని క్షణాల్లోనే మనిషి ప్రాణం తీసే అత్యంత భయంకరమైన పాము గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రపంచంలో మొత్తం మూడు వేలకు పైగా పాముల జాతులు ఉన్నాయని చెబుతుంటారు. వీటిలో 500 పాములు విషపూరితమైనవి కాగా.. కొన్ని పాములు మాత్రం చాలా డేంజరస్. అలాంటి పాముల్లో ఇన్‌లాండ్ తాయ్‌పాన్ (Inland Taipan) అగ్రస్థానంలో ఉంది. దీనిని “స్మాల్-స్కేల్డ్ స్నేక్” లేదా Oxyuranus microlepidotus అని కూడా పిలుస్తారు.
ఈ పాము ఏ దేశంలో ఉంది..
ఆస్ట్రేలియాలోని ఎడారి ప్రాంతాల్లో ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీని విషం ఎంత భయంకరమైనదంటే.. ఒక్క కాటులోనే 100 మంది పెద్దలను.. లేదా 250,000 ఎలుకలను చంపగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని విషంలో న్యూరోటాక్సిన్లు, హెమోటాక్సిన్లు, మరియు మైయోటాక్సిన్లు ఉంటాయి, ఇవి శరీరంలో నాడీ వ్యవస్థ, రక్తం, కండరాలను వేగంగా దెబ్బతీస్తాయి. ఈ పాము కాటేసిన కొన్ని క్షణాల్లోనే విషం శరీరం మొత్తం పాకి మనిషి ప్రాణాపాయస్థితిలోకి జారుకుంటాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఒక్క కాటులో ఇది దాదాపు 110 మిల్లీగ్రాముల విషాన్ని ఇంజెక్ట్ చేయగలదు, ఇది కింగ్ కోబ్రా విషం కంటే 50 రెట్లు, రాటిల్ స్నేక్ విషం కంటే 300 రెట్లు శక్తివంతమైనది.
లక్షణాలు..
ఈ పాము కాటేసిన కొద్ది క్షణాల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి, వాంతులు, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, కొన్ని సందర్భాల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. వెంటనే వైద్య చికిత్స అందించకపోతే కేవలం 30-45 నిమిషాల్లో మరణం సంభవించవచ్చు.
చూడటానికి ఎలా ఉంటుంది..
ఇన్‌లాండ్ తాయ్‌పాన్ సాధారణంగా 1.8-2.5 మీటర్ల పొడవు ఉంటుంది, గోధుమ రంగు లేదా లేత గోధుమ రంగు పొలుసులతో కనిపిస్తుంది. ఈ పాము రుతువులను బట్టి తన రూపాన్ని కొద్దిగా మార్చుకుంటూ ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్, సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ సరిహద్దు ప్రాంతాల్లోని శుష్క భూముల్లో నివసిస్తుంది.
ఈ పాముకు సిగ్గు ఎక్కువ..
అయితే ఇంత భయంకరమైన ఈ పాముకు సిగ్గు ఎక్కువ. ఏకాంతంగా ఉండేందుకే ఇష్టపడుతుంది. మనుషులను చూస్తే సాధారణంగా పారిపోతుంది. కానీ ఈ పామును బెదిరించడం.. కట్టెలతో దాడి చేయడం వంటివి చేస్తే కచ్చితంగా కాటు వేస్తుంది.
చిన్న క్షీరదాలు, ముఖ్యంగా ఎలుకలు, దీని ప్రధాన ఆహారం. దీని విషం వేగంగా శరీరంలో వ్యాపించి, ఆహారాన్ని త్వరగా చంపుతుంది. ఇన్‌లాండ్ తాయ్‌పాన్ కాటు వేసిన వెంటనే శరీరంలో విషం రక్తం ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తూ శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. రక్తం గడ్డకట్టడం, కండరాలు క్షీణించడం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు కూడా సంభవిస్తాయి. ఆస్ట్రేలియాలో ఇన్‌లాండ్ తాయ్‌పాన్ కాటుకు ప్రత్యేక యాంటీవెనమ్ అందుబాటులో ఉంది. ఈ యాంటీవెనమ్ సకాలంలో ఇస్తే, బాధితుడు కోలుకునే అవకాశం ఉంది.