న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం భేటీ అయ్యారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేష్ బహుకరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సహకారం అందించాలని కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు రాష్ట్ర విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నాం అని..ఉన్నతవిద్యలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు మీ సహకారం, మార్గదర్శనం కావాలని ప్రధాని మోదీని అభ్యర్థించారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మోదీకి వివరించారు. వికసిత్ భారత్ – 2047లో భాగస్వాములుగా ముందుకెలుతున్నామని వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రధానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను మంత్రి లోకేష్ వివరించారు. ప్రధాని మోదీ స్పందిస్తూ… రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు.