Site icon vidhaatha

HYD స్థానిక ఎమ్మెల్సీకి.. నామినేషన్లు షురూ! పోటీకి దూరంగా ప్రధాన పార్టీలు

విధాత : హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రయ మొదలైంది. తొలి రోజు స్వతంత్ర అభ్యర్థి చలిక చంద్రశేఖర్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఏప్రిల్ 4న నామినేషన్లకు చివరి తేదీ కాగా, ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన,
ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణ, ఏప్రిల్ 23న పోలింగ్, ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ప్రస్తుత ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్(బీఆర్ఎస్) పదవి కాలం 2025 మే 1వ తేదీతో ముగిసిపోనుండటంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

పోటీకి దూరంగా ప్రధాన పార్టీలు

కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ దూరం కానుంది. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి సరైన బలం లేనందున పోటీకి దూరంగా ఉండాలని పార్టీ భావిస్తుంది. ఎన్నికల్లో సూత్రప్రాయంగా ఎంఐఎంకి కాంగ్రెస్ మద్దతునివ్వనుందని సమాచారం. అటు బీజేపీకి సైతం తగిన సంఖ్యాబలం లేదు. బీజేపీకి ప్రస్తుతం 25 ఓట్ల మేరకు బలం ఉన్నప్పటికి ఎంఐఎం పార్టీకి ఉన్న సంఖ్యాబలంలో సగం ఓట్లు కూడా లేవు. 2020 డిసెంబర్ నెలలో జరిగి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 56 స్థానాలు, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లోనే విజయం సాధించింది.

అయితే రాష్ట్ర రాజకీయాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరింది. మరికొంత మంత్రి బీఆర్ఎస్, బీజేపీ కార్పోరేటర్లు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన బలం కాంగ్రెస్ పార్టీకి లేకపోవడంతోనే ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తుంది. బీఆర్ఎస్ కూడా గెలుపు సాధనకు అవసరమైన సంఖ్యాబలం లేనందునా.. ఎంఐఎంకు మద్దతు ప్రకటించింది. దీంతో ఈ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి విజయం ఖాయమని భావిస్తున్నారు. మొత్తం 127ఓట్లలో 9 ఖాళీలున్నాయి. ఎంఐఎంకు 52, బీఆర్ఎస్ కు 41, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. ఎవరికి 60ఓట్లు వచ్చినా విజయం సాధిస్తారు. డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ప్రకారం మొత్తం ఓట్లు 110 ఉండగా.. తుది జాబితాలో మారే అవకాశం ఉంది. కార్పొరేటర్లు 81 ఉండగా, ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది ఉన్నారు.

Exit mobile version