Operation Kagar | ఆపరేషన్ కగార్‌లో భాగంగా మావోయిస్టులకు పెట్టని కోటలాంటి అబూజ్‌మాడ్‌ను సైతం పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నిత్యం రక్తమోడుతున్నది. వరుస ఎన్‌కౌంటర్లతో ఆదివాసీ ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రత్యేకించి కొద్ది రోజుల నుంచీ సాగుతున్న మారణహోమంలో.. చనిపోతున్నవారంతా మావోయిస్టు పార్టీలో దశాబ్దాల తరబడి పనిచేస్తూ ఉన్న సీనియర్ నేతలు కావడం గమనార్హం. రోజుకో విషాద వార్త తెలుగు నేతలను తాకుతుండటం.. విప్లవ అభిమానులు, బంధువులు, వారి స్నేహితులు, ప్రజాస్వామిక వాదులను కలచివేస్తున్నది. చివరికి మృతదేహాలను ఆఖరి చూపు చూసుకొనే అవకాశం కూడా కోల్పోయి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరోవైపు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ రోజురోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది. మధ్య భారతంలో కగార్ పేరుతో చేపట్టిన సైనిక ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి కనీస సానుకూల స్పందన కనిపించడం లేదు. పైగా.. ఎన్‌కౌంటర్లు, వాటిలో మరణాలు పెరుగుతూ ఉన్నాయి.
బసవరాజు మృతితో తీవ్ర నష్టం
ఛత్తీస్‌గఢ్‌లోని గుండె కోట్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలోనే మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోవడం ఆ పార్టీని తీవ్రంగా నష్టపర్చింది. తాజాగా ఆ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు నరసింహం అలియాస్ గౌతమ్ అలియాస్ సోమన్న గురువారం ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. బీజాపూర్ సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నదని, మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు తమకు ఉన్న విశ్వసనీయ సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మరణించారు. సుధాకర్ చనిపోయిన ఎన్‌కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తున్నది.
నేలకొరుగుతున్న కీలక నేతలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు ఒక్కొక్కరు నేలకొరుగుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో నాయకుల మృతితో ఆ పార్టీ కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నది. సిద్ధాంత, రాజకీయ అనుభవంతో పాటు పార్టీకి దిక్సూచిలా పనిచేసిన ముఖ్య నాయకులు ప్రాణాలు కోల్పోవడం, అందులోనూ.. దశాబ్దాల కాలంలో పోలీసుల వేటకు చిక్కని నాయకులు ఇలా ఎన్‌కౌంటర్‌లలో విగతజీవులై పడి ఉన్న ఫొటోలు వారి అభిమానులను నివ్వెరపరుస్తున్నది. ఈ దేశ పౌరులను సాయిధ బలగాలు మట్టు పెట్టడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగబద్ధ ప్రభుత్వం బహిరంగ ప్రకటనలు చేసి మరీ మావోయిస్టులను నిర్మూలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను సైతం బంధువులకు ఇవ్వకుండా అనామకుల మాదిరి కాల్చి వేయడంపై తీవ్ర ఆభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. మృతదేహాల విషయంలో అనుసరిస్తున్నఈ కొత్త పద్ధతిని ప్రజాస్వామికవాదులు సైతం నిరసిస్తున్నారు. కనీస మానవీయ విలువలు కూడా పాటించడం లేదన్న ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ల పరంపర ఇంకెంత కాలం కొనసాగుతుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా చర్చలు జరిపి, శాంతియుత వాతావరణాన్ని సృష్టించేందుకు ఇరువర్గాలు ప్రయత్నించాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది.