విధాత: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యం నిర్వహించిన దాడులలో మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. జైషే మహమ్మద్ , లష్కరి తొయిబా హెడ్ క్వార్టర్స్ ని నేలమట్టం చేశారు. ఈ దాడులలో ఉగ్రసంస్థల ప్రధాన నేతలు హతమైనట్లుగా తెలుస్తోంది. భారత భూభాగం నుంచే ఈ దాడులు నిర్వహించినట్లుగా సైన్యం పేర్కొనడం ఆసక్తి కరం. పాకిస్తాన్ రాడార్లకు అందకుండా భారత్ మిస్సైల్స్ దాడిని జరపడం విశేషం. ఆపరేషన్ సింధూర్ దాడుల అనంతరం భారత ఆర్మీ మరో ట్వీట్ చేసింది. న్యాయం జరిగింది.. జైహింద్ అంటూ ట్వీట్లో పేర్కొంది.
ముందుగానే ఆర్మీ సిగ్నల్స్
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడికి కొన్ని నిమిషాల ముందుగా ఇండియన్ ఆర్మీ Xలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
‘రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్’ అనే క్యాప్షన్తో అర్ధరాత్రి 1.28 గంటలకు ఈ వీడియోను అప్లోడ్ చేసింది.
ఆ తర్వాత 10 నిమిషాలకే ఆర్మీ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.
దాడి చేయబోతున్నామనే విషయాన్ని ఈ వీడియో ద్వారా ఆర్మీ ముందే చెప్పినట్లు తెలుస్తోంది..
ఉగ్ర స్థావరాలపై దాడులకు నిర్వహించిన ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడం ఆసక్తికరంగా మారింది. పల్గాం ఉగ్రదాడిలో భారత హిందూ మహిళల భర్తలను చంపి వారి నుదుటి బొట్టును చెరిపివేసిన దానికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం విశేషం. భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సహా భారత్ లోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు అభినందనలు తెలిపారు.
మరోవైపు పాకిస్థాన్ ప్రతీకారదారులకు పాల్పడే అవకాశం ఉండడంతో భారత్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. పలు విమానాశ్రయాలను మూసి వేయడంతో పాటు సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. వాయు జల మార్గాల అన్నింటిలోనూ నిఘా పెంచింది. పాక్ వైమానిక దాడులను అడ్డుకునేందుకు రాడార్ వ్యవస్థను పటిష్టం చేసింది.