విధాత: జమ్మూకశ్మీర్ లో 26మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్న పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐఏకి అప్పగించింది. దీంతో విచారణ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్ ఐఏ బృందం రంగంలోకి దిగింది. ఏప్రిల్ 23 నుంచి ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఆరా తీస్తుంది. పహల్గామ్ దాడిలో ప్రాణాలతో బయటపడిన వారి వాంగ్మూలాలను ఎన్ఐఏ గత రెండు రోజులుగా నమోదు చేస్తోంది. డజన్ల కొద్దీ ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను (ఓజీడబ్ల్యూ) విచారించడంతో పాటు ప్రస్తుతం జైళ్లలో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇతర ఉగ్ర సంస్థలకు చెందిన టెర్రరిస్టలను కూడా ప్రశ్నించనుంది.
పాకిస్థాన్ ప్రేరేపిత, లష్కరే తోయిబా (ఎల్ఈటీ) తన ప్రాక్సీ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ద్వారా నిర్వహించిన ఈ ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్ పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసును వారి నుంచి ఎన్ఐఏ తీసుకోనుంది. మరోవైపు ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), జమ్ముకశ్మీర్ పోలీసులు.. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన దుండగుల కోసం గాలిస్తున్నారు. అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, హషీమ్ మూసా అలియాస్ సులేమాన్, స్థానిక ఆపరేటర్ ఆదిల్ హుస్సేన్ థోకర్ వంటి ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్ లను జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం విడుదల చేశారు. ఉగ్రవాదుల ఇళ్లను సైతం సైన్యం పేల్చివేసింది.