Site icon vidhaatha

Ind Vs Pak | క‌వ్విస్తున్న పాకిస్థాన్.. భారత్ అప్రమత్తం!

క్షిపణి పరీక్షకు పాక్ ఆదేశాలు..!

విధాత: పహల్గామ్‌ ఉగ్ర దాడి అనంతరం పాకిస్థాన్ సైనిక పరంగా హడావుడి చేస్తుంది. ఉగ్రదాడి ఘటన అనంతరం పాకిస్తాన్ మిలటరీ అధికారులు భారత్ సరిహద్దుల వెంట భారీగా సైన్యాన్ని మోహరిస్తున్నారు. కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి కి యుద్ధ విమానాలను తరలించింది. పాక్ కవ్వింపు చర్యలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. పాక్ తాజాగా మరింతగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు కనిపిస్తోంది. ఉపరి తల క్షిపణి పరీక్షకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో ఉపరితలం నుంచి ఉపరితలం వరకు కరాచీ తీరం వెంబడి క్షిపణి పరీక్ష నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. అరేబియా సముద్ర తీరంలో క్షిపణులను పరీక్షించాలని సంకేతాలు ఇచ్చింది. దీంతో భారత్ అప్రమత్తం అయ్యింది. పాక్ చర్యలను భారత్ రక్షణ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. భారత్ నుంచి కూడా భద్రతా బలగాలు సరిహద్దు భద్రతపై నిఘా పెంచాయి.

త్రివిధ దళాలను కేంద్రం ఇప్పటికే అప్రమత్తం చేసింది. గురువారం భారత్ ప్రభుత్వం పాకిస్తాన్ లోని భారత పౌరులను వెంటనే ఆ దేశం వీడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని గట్టి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న భారతీయ పౌరులు కూడా వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి రావాలని సూచించింది. మరోవైపు పాకిస్తాన్ జాతీయులకు వీసాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు జారీ చేయబడిన అన్ని భారతీయ వీసాలు ఏప్రిల్ 27, 2025 నుండి రద్దు చేస్తున్నట్లు కేంద్రం చెప్పింది. ముందుగా జారీ చేయబడిన వైద్య వీసాలు ఏప్రిల్ 29, 2025 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తానీ జాతీయులు కొత్త నిబంధనల ప్రకారం వారి వీసాల గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లాలని చెప్పింది.

భారత నేవి క్షిపణి ప్రయోగం విజయవంతం

పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో ఉద్రిక్తతలు నెలకొనడం..పాక్ క్షిపణి ప్రయోగాలకు పూనుకోవడంతో అప్రమత్తమైంది. భారత నౌకదళం గైడెడ్‌ మిసైల్‌ డెస్ట్రాయర్‌ ఐఎన్‌ఎస్‌ సూరత్‌ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్‌ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు గురువారం వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీస్కిమ్మింగ్‌ టార్గెట్‌లుగా పేర్కొంటారు. టార్గెట్‌పైకి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ (ఎంఆర్‌-ఎస్‌ఏఎం) ను వినియోగించారు. ఐఎన్‌ఎస్‌ సూరత్‌, వివిధ రకాల మిలటరీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి లక్ష్యాన్ని ట్రాక్‌ చేస్తూ ధ్వంసం చేసింది.

పాక్ వైపు మళ్ళిన విక్రాంత్

విమానవాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ అరేబియా సముద్రంలోకి వచ్చింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు దీనిని ధ్రువీకరించాయి. ప్రస్తుతం కర్ణాటకలో కార్వార్‌ పోర్టు సమీపంలో ఇది గస్తీ కాస్తోంది. కొన్ని వారాల ముందే అప్పటి ప్రణాళిక మేరకే విక్రాంత్ మోహరింపు జరిగిందని చెబుతున్నప్పటికి పహల్గాం దాడి వేళ ఈ సమాచారం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ సరిహద్దు జలాల వైపుగా విక్రాంత్ ను మళ్లించినట్లుగా తెలుస్తుంది.

వరుస నిర్ణయాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దౌత్యవేత్తలను ఖాళీ చేయాలని ఆదేశించింది. అలాగే పాకిస్థాన్ ఎక్స్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేసింది. అంతేకాకుండా పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. సినిమాలను నిషేదించింది. భారత పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. తాజాగా పాక్ స్టాక్ ఎక్చేంజి వెబ్ సైట్ ను భారత్ మూసివేసింది. పహల్గామ్ ఎఫెక్ట్ తో పాక్ స్టాక్ మార్కెట్లు రెండుశాతంకు పైగా పడిపోయాయి. భారత ప్రభుత్వం చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా దెబ్బతింటుంది.

భారత్ వరుసగా భారత్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆత్మరక్షణలో పడిపోయింది. భారత్ నుంచి ఆంక్షల యుద్దంతో పాటు సర్జికల్ స్ట్రైక్స్ వంటి దాడులకు అవకాశం లేకపోలేదని పాక్ భావిస్తుంది. ముఖ్యంగా పీవోకే కోసం ప్రత్యక్ష యుద్దానికి కూడా అవకాశముందని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. అటు అంతర్జాతీయంగా కూడా పహల్గామ్ దాడి పట్ల వ్యతిరేకత వ్యక్తమవ్వడం కూడా పాక్ కు సంకటంగా మారుతుంది.

Exit mobile version