Site icon vidhaatha

రీల్స్‌ కామెంట్లపై రోడ్డుపై జుట్టు పట్టుకుని తన్నుకున్న అక్కాచెల్లెళ్లు!

నొయిడా: ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలనేవి టీనేజర్లు మొదలుకుని, వృద్ధుల దాకా అనేక మంది జీవితంలో భాగమైపోతున్నాయి. రీల్స్‌ చూడటం ఒక ఎత్తయితే.. రీల్స్‌ చేసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసుకుని పాపులారిటీ కొట్టేయడం ఇంకో ఎత్తు. ఒక్కో సందర్భంలో రీల్స్‌ చేసేవారి పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లిన సందర్భాలు కూడా తరచూ చూస్తేనే ఉంటాం. రీల్స్‌ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు.. ప్రాణాలు తీసుకున్నవారినీ చూశాం. ఇక కామెంట్ల గోల సరేసరి. చేసిన రీల్‌పై ఒక్క నెగెటివ్‌ కామెంట్‌ వచ్చిందంటే చాలు యుద్ధమే! అయితే.. ఈ యుద్ధాలు చాలా వరకు ఆన్‌లైన్‌కే పరిమితమవుతుంటాయి. అప్పుడుప్పుడు రోడ్డునపడుతుంటాయి. ఇదిగో.. ఇలాగ! ఈ వీడియో నొయిడాలో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించినది.

నడిరోడ్డుపై పట్టపగలు కొంతమంది టీనేజర్లు ఒకరి జుట్టు ఒకరు పీకుతూ, పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఎందుకమ్మా ఈ గోల అంటే.. కామెంట్ల విషయంలో వచ్చిన పంచాయితీ అని తేలింది. ఈ వీడియోలో నలుగురు అమ్మాయిలు ప్రజలు చూస్తుండగానే గొడవకు దిగి జట్టుపట్టుకుని తన్నుకున్నారు. వాళ్లని ఎలా అదుపు చేయాలో తెలియక అక్కడే ఉన్న ఇద్దరు పోలీసు కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. వారి మధ్య జోక్యం చేసుకునేందుకు చుట్టుపక్కల ఉన్న ఎవరూ సాహసించలేదు. వారు 9, 10 తరగతులు చదివే అమ్మాయిలని హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొన్నది.

ఇంకో దిగ్భ్రాంతికర విషయం ఏమిటంటే.. వారు అక్కా చెల్లెళ్లేనట! ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. దీనిని పరిష్కరించుకునేందుకు నొయిడాలోని సెక్టర్‌ 93 వద్ద ఉన్న బయోడైవర్సిటీ పార్క్‌లో కలిసి.. ‘చర్చలు’ జరుపుదామని నిర్ణయించుకున్నారట! చర్చించుకుని పరిష్కరించుకునే సంగతి పక్కకు పెట్టి.. వాదులాటకు దిగి.. ఆఖరుకు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. వారి కొట్లాటను మరో ఒక ఎక్స్‌ యూజర్‌ చిత్రీకరించి.. తన ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ‘పోలీసులు ఉన్నా.. ఆ అమ్మాయిలు నడిరోడ్డుపై తన్నుకుంటుంటే.. ఏ ఒక్కరూ వారిని ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. అసలు అధికారులు ఏం చేస్తున్నారు?’ అని ఆయన తన పోస్టులో రాశారు. ఈ వీడియోను ఆన్‌లైన్‌లో షేర్‌ చేశాక.. ఇదివైరల్‌ అయింది. కామెంట్ల సెక్షన్‌ ఛలోక్తులతో, సరదా వ్యాఖ్యలతో నిండి.. పొంగిపొర్లింది. ‘ఇలా చాప్రి క్యాటగిరీ వాళ్లు భారతదేశంలో లక్షల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది వస్తారు’ అని ఒక యూజర్‌ వ్యాఖ్యానించారు. మరొకరు ‘వై షుడ్‌ మెన్‌ హావ్‌ ఆల్‌ ది ఫన్‌’ అని కామెంట్‌ చేశారు. ‘పోలీసులు పురుషులు. వారిని పట్టుకుంటే దాన్ని లైంగిక వేధింపులు అని ముద్ర వేస్తారు’ అని మరొకరు రాశారు.

Exit mobile version