ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ను సిట్ శుక్రవారం మరోసారి విచారించింది. ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావును రేపు శనివారం మూడోసారి ప్రశ్నించనున్న నేపథ్యంలో రెండుసార్లు జరిగిన విచారణలో తెలిపిన అంశాలపై ప్రణీత్ రావు నుంచి వివరణ తీసుకున్నారు.
హార్డ్ డిస్క్‌ల ధ్వంసం అంశాలపైనే ప్రధానంగా ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించారు. ఎస్ఐబీలో ట్యాపింగ్ కోసం ఎస్ వోటీ ఎవరు ఏర్పాటు చేశారని ప్రణిత్ రావును ప్రశ్నించారు. మరోసారి ప్రణిత్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అలాగే జడ్జిల ఫోన్ ట్యాపింగ్ ఎవరి ఆదేశాలతో చేశారని మరోసారి ప్రణిత్ రావును ప్రశ్నించారు.
ఈ కేసుకు సంబంధించి గతంలోనే ప్రణీత్ రావును సిట్ అధికారులు పలుమార్లు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రణీత్ రావు గతంలో విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశామని, హర్డ్ డిస్క్ లను ధ్వంసం చేశామని వెల్లడించాడు. ప్రభాకర్ రావును శనివారం మరోసారి విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం ఉంది.