SLBC టన్నెల్ సర్వే పరిశీలనకు బయలుదేరిన సీఎం, మంత్రులు

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు

హైదరాబాద్, నవంబర్ 03(విధాత): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి కి చేరుకుంటారు. అక్కడ హెలీ మాగ్నేటిక్ సర్వే కు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ ను.. అందులో ఉన్న అధునాతన పరికరాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలిస్తారు.

అక్కడే ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వే హెలికాప్టర్ టేకాఫ్ సిగ్నల్ ఇస్తారు. మన్నెవారి పల్లె సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ అవుట్ లెట్ వైపు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి మంత్రులున్న హెలికాప్టర్ కూడా సర్వే హెలికాప్టర్ తో పాటు బయల్దేరి సమాంతరంగా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.

ఎన్‌జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే జరుగుతుంది. హెలికాప్టర్ కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్‌మీటర్‌తో ఈ సర్వే చేపడుతారు. భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా ను సేకరిస్తారు, భూమి లోపల ఉండే షీర్‌జోన్‌లు, నీటి ప్రవాహాలు గుర్తించేందుకు ఇది హైటెక్ సర్వే పద్ధతి.