- 505 కోట్ల చెల్లింపులపై ఆర్థిక శాఖ నిర్లక్ష్యం
- ఆరు వేల మంది కాంట్రాక్లర్లు అరిగోస
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి
హైదరాబాద్, మే 5 (విధాత)
Small Contractors | తమ పెండింగ్ కాంట్రాక్టు బిల్లులు చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్ల వెల్పేర్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఆస్తులు తాకట్టు పెట్టి పనులు చేస్తే చెల్లించకుండా ఆర్థిక శాఖ సతాయిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికాముఖంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గత నెల 21న చేసిన ప్రకటన ప్రకారం వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అసోసియేషన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరింది. ‘తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ విభాగాలలో రూ.10 లక్షల లోపు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు 6వేల మంది వరకు ఉన్నారు. వీరిపై వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. పూర్తయిన పనులకు డబ్బులు చెల్లించాలని అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును కలిసి వినతి పత్రం ఇచ్చామని, తమ వినతి మేరకు గత నెల 21వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న కాంట్రాక్టర్లకు రూ.500 కోట్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ ప్రకటన చూసి తాము డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేస్తారని ఎదురు చూశామని, కానీ.. నేటి వరకూ ఒక్క పైసా కూడా వేయకుండా బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఆపకుండా డబ్బులు వేస్తున్నారని అసోసియేషన్ ఆరోపించింది. రామకృష్ణారావు విడుదల చేసే బడా బిల్లులలో ఒక్క బిల్లు ఆపితే తమ బకాయిలు మొత్తం తీరుతాయి. గత ప్రభుత్వంలో ఎన్నో బాధలు పడ్డాం, ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. తమ వినతి మేరకు రూ.505 కోట్ల పెండింగ్ బకాయిలు మంజూరు చేయాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఆర్ అండ్ బీ లో రూ.100 కోట్లు, పంచాయత్ రాజ్ లో రూ.65 కోట్లు, మున్సిపల్ వ్యవహారాల శాఖ లో రూ.75 కోట్లు, ఐబీ లో రూ.65 కోట్లు, సోషల్ వెల్ఫేర్ లో రూ.100 కోట్లు, రూరల్ వాటర్ సప్లయిలో రూ.100 కోట్ల చొప్పున బకాయిలు ఉన్నాయని తెలిపారు.